టీ-బిల్లుపై కడదాకా అదే సందిగ్దత, సస్పెన్స్

 

తెలంగాణా బిల్లు, రాష్ట్ర విభజన అంశాలపై రాజకీయ నేతలు, మీడియా, విశ్లేషకులు కూడా ప్రాంతాల వారిగా విడిపోయి ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. చివరికి రాజ్యాంగ నిపుణులు, రిటైర్డ్ జడ్జీలు కూడా బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో ఈ అంశాలపై ప్రజలలో చాలా సందిగ్దత నెలకొంది. కొందరు టీ-బిల్లుపై కిరణ్ ప్రవేశపెట్టిన తీర్మానం పనికిరాదని తేల్చేస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి అదే బ్రహ్మాస్త్రమని అంటున్నారు.

 

టీ-బిల్లుపై చర్చలు, వాదోపవాదాలు ఇలా సాగుతుంటే, కేంద్రం మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. ఇంకా బిల్లు చేతికి రాకమునుపే, రేపు కేంద్ర మంత్రుల బృందం సమావేశమయి బిల్లుకి తుది రూపం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. బిల్లుకి మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ప్రయత్నాలు చేస్తోందో తెలియదు కానీ, బిల్లుని పార్లమెంటు చేత ఖచ్చితంగా ఆమోదింపజేస్తామని గట్టిగా చెపుతోంది. ఈ రోజు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ అన్ని పార్టీలతో సమావేశమవనున్నారు. బహుశః అదే సమయంలో బీజేపీని టీ-బిల్లుకి మద్దతు ఈయమని కాంగ్రెస్ పార్టీ తరపున మరోమారు అభ్యర్దిస్తారేమో!

 

అవసరమయితే పార్లమెంటు సమావేశాలు పొడిగించయినా బిల్లుని ఆమోదింపజేస్తామని కాంగ్రెస్ పెద్దలు చెపుతున్నపటికీ, ఈనెల 24 లేదా 26 తేదీలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల కమీషన్ సిద్దమవుతోంది గనుక, సమావేశాలు ఇక పొడిగించడానికి వీలుకుదరకపోవచ్చును. అందువల్ల ఈలోగానే టీ-బిల్లుని ఆమోదించవలసి ఉంటుంది.

 

కేవలం రెండు వారాలు మాత్రమే సాగే ఓట్-ఆన్-ఎకౌంట్ సమావేశాలలో, కేంద్రంలో ఎన్నికల తరువాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ ప్రభుత్వ నిర్వహణకు అవసరమయిన ఖర్చుల నిమ్మితం కొన్ని కీలకమయిన ఆర్ధిక బిల్లులు, రాహుల్ గాంధీ వ్యక్తిగత ప్రతిష్ట పెంచేందుకు ఉద్దేశించబడిన మరికొన్ని బిల్లులు కూడా ఉభయ సభలలో ప్రవేశపెట్టి ఆమోదించవలసి ఉంటుంది. అదే సమయంలో టీ-బిల్లు కూడా ప్రవేశపెట్టి, ఉభయ సభలలో సవివరంగా దానిపై చర్చించిన తరువాతనే ఆమోదించవలసి ఉంటుంది.

 

కానీ, సమయాభావం వలన ఉభయ సభలలో బిల్లుపై అర్ధవంతమయిన చర్చ జరగపోవచ్చును. బిల్లుపై పార్లమెంటులో కూడా మరింత లోతుగా చర్చ జరగకుండా నివారించేందుకే బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఇటువంటి సమయాన్ని ఎంచుకొని ఉండవచ్చును. ఇవే యూపీయే ప్రభుత్వం హయంలో జరిగే చిట్టచివరి పార్లమెంటు సమావేశాలు గనుక, బీజేపీ పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఇచ్చినా, ఇవ్వకున్నా అతితక్కువ ఇబ్బందితో, నష్టంతో బయటపడవచ్చనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉండి ఉండవచ్చును.

 

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన నాటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రతీ దశలో కూడా ఇటువంటి సందిగ్దత కలిగి ఉండటం, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనిస్తే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎంత అసమర్ధంగా, అసంబద్దంగా నిర్వహిస్తోందో అర్ధమవుతుంది. రాష్ట్ర శాసనసభ తీర్మానంతో మొదలవవలసిన విభజన ప్రక్రియను, ముగింపులో దానికి పంపడం, పంపిన తరువాత కూడా దాని అభిప్రాయానికి ఎటువంటి విలువలేదని చెప్పడం కాంగ్రెస్ అధిష్టానానికి చట్ట సభల పట్ల, ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల పట్ల ఎంతటి చులకన భావం ఉందో తెలియజేస్తోంది. ఏమయినప్పటికీ, రానున్న ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పడుతుందో లేదో కేవలం మరో రెండు మూడు వారాలలో ఖచ్చితంగా తేలిపోతుంది.