తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి పేలుడు పదార్ధాలే కారణం
Published on: Thu Aug 30, 2012 10:37AM
తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి పేలుడు పదార్ధాలే కారణమని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. శివకాశీ బాణసంచాని తయారుచేసే
పేలుడు పదార్ధాలవల్ల ప్రమాదం జరిగిందా లేక అరాచకశక్తులు పేలుడుపదార్ధాలను తీసుకెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగిందా.. అన్న
విషయంమీద మాత్రం ఇంకా ఓ క్లారిటీ రాలేదు. బోగీల్లో మంటలు వేగంగా వ్యాపించడానికి కారణాలనుమాత్రం అధికారులు ఇప్పటికీ
చెప్పలేకపోతున్నారు. జూలై 30వతేదీ అర్థరాత్రి నెల్లూరు సమీపంలో జరిగిన తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 32మంది
కాలిబూడిదైపోయారు. అంతపెద్ద ప్రమాదం జరగడానికి కచ్చితంగా పేలుడు పదార్ధాలే కారణమై ఉంటాయన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమైనప్పటికీ ఫోరెన్సిక్ రిపోర్ట్ అందేవరకూ ఎటూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఎస్ 11 బోగీలో 53, 58 బెర్తుల కింద పేలుడు పదార్ధాల అవశేషాలున్నట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైంది. అయితే అవి బాణసంచా అవశేషాలని చెప్పొచ్చని అధికారులంటున్నారు. తమిళనాడు ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ పూర్తై నెలరోజులు కావొస్తున్నా ఇంతవరకూ నివేదిక వెలుగుచూడలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వనిర్లక్షవైఖరికి నిదర్శనమని బాధితులు మండిపడుతున్నారు.


