తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బూచాడి భయం

 

 

వాళ్లు మనకి అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారు. ఎవరన్నా మనుషులు ఒంటరిగా కనిపిస్తే దాడి చేస్తారు. ఆ తర్వాత అతని మెదడుని ఒలుచుకుని తినేస్తారు. ఇదేదో ఇంగ్లిష్‌ హారర్‌ మూవీ కాదు! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యమేలుతోన్న బూచాళ్ల భయం. బీహార్‌ నుంచి వచ్చిన కొంతమంది సైకోలు ఇలా దాడులకు పాల్పడుతున్నారంటూ కొద్ది రోజులుగా వాట్సప్‌లో సందేశాలు వ్యాపిస్తున్నాయి. దాంతో చాలా గ్రామాల్లో పిల్లలను గదుల్లో ఉంచి తాళం వేసేస్తున్నారు. కొత్తవాళ్లు ఎవరన్నా కనిపిస్తే చితకబాదేస్తున్నారు. వింతగా ఎవరు ఉన్నా వెంటపడుతున్నారు. చివరికి పోలీసులు రంగంలోకి తిరిగి ఊరూరా తిరిగి ప్రజలను సముదాయించాల్సి వస్తోంది.

తమిళనాడులో ఇలాగే ఓ కారులో దిగినవారిని, పిల్లలు ఎత్తుకుపోయేవారుగా స్థానికులు అనుమానించారు. ఈ విషయాన్ని వాట్సప్‌లో షేర్‌ చేసుకుని, ఊరు బయట వాళ్లని అడ్డగించారు. అమాయకులం అని మొత్తుకున్నా వినకుండా వాళ్లలో ముగ్గురిని కొట్టి చంపేశారు. బూచాడి భయంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయని పోలీసులు భయపడుతున్నారు. అందుకే ఓ పక్క బూచాడి భయం లేదని బుజ్జగిస్తూనే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించాల్సి వస్తోంది.

మనిషి సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్లినా, ఆలోచన మాత్రం ఆటవిక స్థాయిలోనే మిగిలిపోతే ఎలా ఉంటుందో బూచాడి భయం మరోసారి నిరూపిస్తోంది. వెర్రితనానికి వాట్సప్‌ తోడై విచక్షణను మంటకలిపేస్తోంది.