స్వైన్ ఫ్లూకి రాజయ్య బలయ్యారా?

 

స్వైన్ ఫ్లూ జ్వరాల కారణంగా చాలా మంది ప్రజలు చనిపోయారు. నేటికీ అనేక వందల మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. చివరికి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఈ స్వైన్ ఫ్లూ భారినపడినట్లు వార్తలు వచ్చేయి. ఈ స్వైన్ ఫ్లూ దెబ్బకి ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న టి.రాజయ్య పదవి కూడా ఊడిపోయింది. అది కూడా చాలా అవమానకరంగా జరిగింది.

 

ఇంత నష్టం, కష్టం తెచ్చిన ఈ స్వైన్ ఫ్లూ ఒక్కరికి మాత్రం ఊహించని అదృష్టం తెచ్చిపెట్టింది. యంపీ కడియం శ్రీహరి మెడలో ఉపముఖ్యమంత్రి హారం వేసిపోయింది. తంతే బూరెల గంపలో పడినట్లు యంపీగా ఉన్న ఆయన తీసుకువచ్చి ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చేబెట్టారు.

 

అందుకు ఆయన చాలా సంతోషపడి ఉండవచ్చును. కానీ మొదటి నుండి తెరాసలో ఉంటూ కేసీఆర్ నే అంటిపెట్టుకొని తిరగిన దళితుడయిన రాజయ్యని అసమర్ధుడు అనే ముద్ర వేసి పదవిలో నుండి తొలగించి ఆ స్థానంలో యంపీగా ఉన్న కడియం శ్రీహరిని నియమించడం తెరాస నేతలకు, పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా రాజయ్యకు జీర్ణించుకోవడం చాలా కష్టమే. తెరాసలో అనేకమంది సమర్దులయిన సీనియర్ నేతలు, యం.యల్యేలు చాలా కాలంగా మంత్రి పదవులకు ఆశగా ఎదురుచూస్తుంటే వారినందరినీ కాదని తెదేపా నుండి వచ్చి యంపీగా ఎన్నికయిన కడియం శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

 

కానీ ఒకసారి పార్టీలో చేరిన తరువాత పాతవాళ్లు కొత్తవాళ్ళు అంటూ విడదీసి చూడలేమని, అందరూ కూడా సమాన హోదా ఉన్న పార్టీ కార్యకర్తలే అవుతారని ఆయన సర్ది చెప్పుకొన్నారు. గోదావరిలో కలిసే అనేక ఉప నదులను ఏవిధంగా వేరు చేసి చూడాలేమో అదేవిధంగా ఎవరయినా ఒకసారి ఒక పార్టీలో చేరిన తరువాత అందరితో సమాన హోదా పొందుతారని, సందర్భాన్ని బట్టి అవకాశాలు, సమీకరణలు మారుతుంటాయని, ఇది రాజకీయాలలో చాలా సహజమయిన విషయం గనుక అందరూ లైట్ తీసుకోవాలని సర్దిచెప్పారు. కొన్ని పొరపాట్లను సవరించుకోనేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని ఆయన కేసీఆర్ ని వెనకేసుకు వచ్చేరు.

 

ఆయనకు మంత్రి పదవి వచ్చింది కనుక ఆయన ఎన్ని మాటలయినా చెప్పగలరు. కానీ ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న రాజయ్యను అసమర్ధుడు అంటూ చాలా అవమానకరంగా తొలగించిన తరువాత ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టినట్లయింది. తద్వారా ఆయన రాజకీయ జీవితం కూడా దెబ్బ తినే ప్రమాదం ఏర్పడింది. ఇదివరకు కూడా ఆయన వరంగల్ పట్టణంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థాపిస్తామని ప్రజలకు చెపుతున్నారని కేసీఆర్ ఆయనను నలుగురి ముందూ మందలించి అవమానించారు. ఇప్పుడు అంతకంటే ఘోరంగా అవమానించి బయటకు గెంటారు.

 

ఈ వ్యవహారాన్ని మరికొంత లోతుగా పరిశీలించి చూసినట్లయితే ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా సమాన బాధ్యత ఉంటుందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పొరపాట్లు సవరించుకోనేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకొన్నారని కడియం చెప్పడం గమనిస్తే, రాజయ్యకి అంత కీలకమయిన పదవులు కట్టబెట్టి కేసీఆర్ కూడా పొరపాటు చేసారని చెప్పకనే చెపుతున్నట్లుంది. కేసీఆర్ చేసినది పొరపాటు అనుకొంటే అందుకు ప్రజలు చాల భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. కానీ కేసీఆర్ చేసిన ఆ పొరపాటుకు దళితుడయిన రాజయ్య శిక్షించబడ్డారు.

 

సాధారణంగా సమర్ధత, అనుభవం ప్రాతిపదికన యం.యల్యేలకు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తుంటారు. ఒకవేళ రాజయ్య అంత సమర్దుడు కాడని కేసీఆర్ భావించి ఉంటే ఆయనకి ముందే ఏదో ఒక అప్రధాన్యమయిన శాఖ కేటాయించి ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితిని నివారించి ఉండవచ్చును. కానీ తెలంగాణా ఏర్పడితే మొట్ట మొదటగా ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇచ్చి, ఆ హామీని గట్టునపెట్టి, ఆ కుర్చీలో కేసీఆర్ సెటిల్ అయిపోయిన తరువాత ప్రజలు, ప్రతిపక్షాలు, స్వంత పార్టీలో నుండి విమర్శలను తప్పించుకోవడానికే రాజయ్యకు కీలకమయిన పదవులు కట్టబెట్టారని అందరికీ తెలిసిన విషయమే. కానీ దాని వలన ఎంత అనర్ధం జరిగిందో అందరూ చూసారు.

 

తెలంగాణా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ జ్వరాలు రాత్రికి రాత్రే ఏమీ వ్యాపించలేదు. కానీ పరిస్థితులు పూర్తిగా చెయ్యి దాటిపోతున్నాయని గ్రహించి, నివారణ చర్యలు చేప్పట్టడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇంత సమయం తీసుకొన్నారు. ఆయన ముందే రాజయ్యను హెచ్చరించి ఉంటే నేడు ఈ పరిస్థితీ వచ్చేది కాదు. ఇదంతా చూస్తుంటే తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి వేసినట్లుంది. పాపం రాజయ్య అనుకోవడం కంటే ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.