శ్వేతా మీనన్ కాన్పు కథ
Published on: Wed Nov 28, 2012 1:01PM

మళయాళనటి శ్వేతామీనన్ నిజ జీవితంలోకూడా నటించింది. కడుపుతో ఉన్న దగ్గర్నుంచి పాపను కనేవరకూ నిజజీవతంలోనూ నటనలో జీవించింది. గర్భం ధరించిన రోజు దగ్గర్నుంచి వివిధ దశల్లో తనలో వస్తున్న మార్పుల్ని, తొమ్మిదో నెలలో తను కనిపించిన తీరుని “కలిమన్ను” సినిమా డైరెక్టర్ షూట్ చేసి పెట్టుకున్నాడు.

శ్వేతకు నొప్పులొస్తున్న సమయంలో లేబర్ రూమ్ లో చకచకా కెమెరాల్ని అమర్చి కాన్పుని చిత్రీకరించారుకూడా. ఈ దృశ్యాల్ని నేరుగా అలాగే సినిమాలో ఉపయోగించారు. దీనిపై కేరళ అసెంబ్లీ స్పీకర్ తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. కాన్పు వ్యక్తిగత వ్యవహారమని, దాన్ని పబ్లిక్ ఇష్యూ చేసి, తెరకెక్కించి డబ్బు చేసుకోవాలని చూడడం అవివేకమని వ్యాఖ్యానించారు.

ప్రకటనల్లో మహిళల్ని అసభ్యంగా చూపిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆక్షేపణలు తెలిపే మహిళా సంఘాలు ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నాయంటూ కేరళ అసెంబ్లీ స్పీకర్ మహిళా లోకాన్ని నిలదీశారు. శ్వేత మాత్రం తాము చేసింది తప్పేమీ కాదంటూ కలిమన్ను దర్శకుడిని వెనకేసుకొస్తోంది. తాను మాతృత్వ మాధుర్యాన్ని చవిచూసే సమయంలో తన భర్తకూడా లేబర్ రూమ్ లో ఉన్నాడని చెబుతోంది.


