పోలీసుల పేరిట నకిలీ ఖాతాలు

స్వాతి లక్రా ఐపిఎస్ పేరుతో ఖాతా.. డబ్బులు పంపమని రిక్వెస్టులు

 

దేశంలోని ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేస్తూ సమాచారాన్ని తస్కరిస్తున్నారు. మరోవైపు నకిలీ ఖాతాలు సృష్టించి రిక్వెస్ట్ లు పంపిస్తూ క్యాష్ డిమాండ్ చేస్తున్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్ర పోలీస్ వరకు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ లో దాదాపు 50మంది పేరుతో నకినీ ఖాతాలు ఫేస్ బుక్ లో తెరిచినట్లు సమాచారం. రెండురోజుల కింద ఐపిఎస్ అధికారి స్వాతి లక్రా పేరుతో ఫేస్ బుక్ లో నకిలీ ఖాతా ఓపెన్ చేసి ఆమె స్నేహితులకు, బంధువులకు డబ్బులు పంపించమని రిక్వెస్ట్ పెట్టారు. అయితే ఈ విషయాన్ని ఆమె దృష్టికి కొందరు తీసుకువెళ్లగా ఇది నకిలీఖాతాగా గుర్తించారు. తాను ఎవరిని నుంచి డబ్బులు అడగలేదని, ఎవరూ స్పందించవద్దని స్వాతి లక్రా తన అధికారిక ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దానితో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని గంటల్లోనే నకిలీఖాతా క్లోజ్ చేశారు సైబర్ దొంగలు.

 

అయితే పోలీసుల విచారణలో ఇప్పటివరకు దాదాపు 50మంది అధికారుల పేరిట నకిలీ ఖాతాలు తెరిచినట్లు గుర్తించారు. ఒడిషా, రాజస్థాన్ నుంచి ఈ ఫేస్ బుక్ అకౌంట్లు క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. త్వరలోనే ఆ ముఠాగుట్టురట్టు చేస్తామని పోలీసులు అంటున్నారు. డబ్బులు పంపమని ఎవరి నుంచి రిక్వెస్ట్ లు వచ్చినా నమ్మవద్దని , జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.