జగన్ కోసం శారదాపీఠం ఐదేళ్లు కష్టపడింది.. మహాభారతం చదివిన ఏకైక సీఎం!!

 

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్‌ జగన్ లు తనకు అత్యంత ఆప్తులు, ప్రాణ సమానులేనని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. సోమవారం శారదాపీఠ ఉత్తరాధికారి నియామక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘కేసీఆర్‌, జగన్‌ ఇద్దరూ నాకు అత్యంత ప్రాణప్రదమైనవారు. కేసీఆర్‌ మహా మేధావి. మహాభారతం చదివిన ఏకైక ముఖ్యమంత్రి ఆయనే. నా హృదయంలో ఒక ఆత్మగా నేను ప్రేమిస్తున్న వ్యక్తి జగన్‌. ఆయనంటే నాకు పరమ ప్రాణం. విశాఖ శ్రీ శారదాపీఠం ఆయన కోసం ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడింది. అక్కడ గోడలు, పక్షులు, చెట్లు, పుట్టలు, వ్యక్తులు.. ఎవర్ని అడిగినా జగన్‌ గెలవాలి అన్న మాటే వినిపించేది. జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్రానికి మంచి చేయాలని శారదాపీఠం బలంగా ఆకాంక్షించింది. అందరు దేవతలు ఆయనను పరిపూర్ణంగా ఆశీర్వదించాలని, ఆంధ్ర ప్రజలకు ఆయన ఎంతో మేలు చేయాలని.. విశాఖ శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది.’’ అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.