అమ్మ ఆగ్రహించింది

అమ్మకు కోపం వచ్చింది. అమ్మకు ఆగ్రహం వచ్చింది. అమ్మకు ఆవేదన కలిగింది. తెలంగాణ ప్రజల ఆది దేవత, గ్రామ దేవత మహంకాళి అమ్మ వారు తన జాతరలో జరిగిన... జరుగుతున్న తప్పులపై తన గళాన్ని విప్పారు. ప్రతి ఏటా సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి ఆలయంలో సంప్రదాయంగా జరిగే భవిష్యవాణి కార్యక్రమంలో ఈసారి తెలంగాణ సర్కార్‌కు రుచించే అంశాలేవీ అమ్మవారు చెప్పలేదు. భవిష్యవాణి వినిపించే అవివాహిత స్వర్ణలత మాటలు స్వయంగా అమ్మవారు చెప్పిన మాటలుగానే తెలంగాణలో పరిగణిస్తారు.

 

 

ఆ మాటలకు ప్రభుత్వం కాని, ప్రజలు కాని ఎంతో విలువ ఇస్తారు. ప్రతి ఏటా ఈ భవిష్య వాణి రంగంలో అమ్మవారు చాలా అంశాలను వివరణ వంటి భరోసా ఇస్తారు. నేనున్నారా.... మీకేమీ కాదు... నే చూసుకుంటా అంటూ ధైర్యం ఇస్తారు. ఎన్నో దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోంది. ఇది సంప్రదాయపు భక్తికి నిర్వచనం. ఇది సంప్రదాయపు ఆచారానికి గీటురాయి. ఇది సంప్రదాయపు నమ్మకాలకు ఓ ఆలంబన. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మహంకాళి జాతర అనంతరం ఆ మర్నాడు జరిగే రంగం కార్యక్రమం పూర్తి అయ్యింది. అయితే ఈసారి మాత్రం కాసింత భిన్నంగా... ఓకింత ఆశ్చర్యంగా అమ్మవారు భవిష్యవాణి చెప్పారు అమ్మ వారి రూపంలో ఉన్న స్వర్ణలత. 

 

 

ఈ పలుకులు సర్కారు వారికే కాదు... ప్రజలకు కూడా కొత్తగానే ఉన్నాయి. భవిష్యవాణిలో అమ్మ వారు ఏమన్నా అది శిలాశాసనంగా భావించే ప్రజలు సోమవారం నాటి అమ్మవారి ప్రతి స్పందనతో నిశ్చేష్టులయ్యారు. తన వద్దకు వచ్చే భక్తులు ప్రతి సారీ ఎంతో ఆనందంగా వస్తారని, తనను దర్శించుకున్న అనంతరం ఓ అద్భుత అనుభూతితో ఇళ్లకు వెళ్తారని భవిష్యవాణిలో అమ్మ వారు చెప్పేవారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా తన భక్తుల కళ్లలో ఆనందాన్ని తాను చూడలేదని, సంతోషం స్ధానంలో వారి ముఖాలలో దుఖం గూడు కట్టుకుందని భవిష్యవాణిలో వినిపించారు స్వర్ణలత. అంతే కాదు... తనకు ముక్కుపుడక ఇచ్చిన వారినే కాదని... యావత్తు ప్రజలందరినీ కాపాడుతానని చెప్పారు. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముక్కుపుడక సమర్పించి తెలంగాణ రాష్ట్ర మొక్కు తీర్చుకున్నారు.

 

 

భవిష్యవాణి తన వ్యాఖ్యల ద్వారా తనకు తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలూ అనే తేడా ఉండదని, అందరిని ఓ తల్లిలా అక్కున చేర్చకుంటానని చెప్పారు. అంతే కాదు... ముక్కుపుడక ఇచ్చినంత మాత్రానా తాను అది తెచ్చిన వారిని మాత్రమే కరుణించనని చెప్పకనే చెప్పారు.  భవిష్యవాణి వాక్కులను స్వయంగా దేవత వాక్కులుగానే పరిగణించే... ఇన్నాళ్లూ పరిగణించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలి. అలా చూస్తే తాను ఎక్కడో తప్పు చేసినట్లుగానే భావించాలి. నిజానికి ఉగాది సందర్భంగా జరిగే పంచాగ శ్రవణాలు... ఇలా జాతరల సందర్భంలో వచ్చే పూనకాలు వంటివి ప్రభుత్వాలకు అనుకూలంగే చెబుతాయి. అధికారంలో ఉన్న వారి ప్రభ వెలిగిపోతుందని, భారీగా వర్షాలు కురిసి రాష్ట్రంలో పుష్కలంగా పంటలు పండుతాయని పంచాగ శ్రవణంలో ప్రవచించడం పరిపాటి. ఈ పంచాగ శ్రవణం చేసే వారు అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకుందుకు అనేక విషయాలు వారికి అనుకూలంగా చెప్పడం కద్దు.

 

 

కాని బోనాల సందర్భంగా చెప్పే భవిష్యవాణిలో మాత్రం ఇంత వరకూ ఇలాంటి రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక అంశాలను చెప్పిన దాఖలాలు లేవు. తాను ఎప్పుడూ న్యాయం పక్షానే ఉంటానని చెప్పిన భవిష్యవాణి నర్మంగర్భంగా తెలంగాణలో న్యాయం జరగడం లేదనే అంశాన్ని చెప్పారు. అంతే కాదు... తనకు బంగారు బోనం సమర్పించడం ఒకింత ఆనందమే అయినా... రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. అంటే బంగారు బోనాలతోనూ.... వజ్రాల ముక్కు పుడకలతోనూ ప్రజలను ఏమార్చినట్లుగా తనను ఏమార్చలేరని అమ్మవారి రూపంలోని స్వర్ణలత చెప్పారు. మాయ మాటల మరాఠి గారడీలు తన వద్ద చెల్లుబాటు కావని అమ్మవారు తన భవిష్యవాణిలో చెప్పకనే చెప్పారు.

 

 

మొత్తానికి తెలంగాణలో మహంకాళి జాతరలో ప్రధాన ఘట్టం  భవిష్యవాణి ప్రతిపక్షాలకు ఓ కొత్త ఆయుధం. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దొరికిన అద్భుత అవకాశం. ఇక తెలంగాణలో ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పాలన పట్ల దేవుళ్లకే వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేసుకోవచ్చు. సాక్షాత్తూ అమ్మ వారే తెరసా ప్రభుత్వాన్ని తిట్టారంటూ హోరెత్తించవచ్చు. మొత్తానికి మహంకాళి అమ్మవారి భవిష్యవాణి ఎవరి భవిష్యత్ ఎలా ఉందో నర్మగర్భంగా చెప్పిందనుకోవాలా... !?