స్వామి గౌడ్ తాపత్రయం అధికారం కోసం కాదుట!

 

సకల జనుల సమ్మెతో తన రాజకీయ జీవితానికి బలమయిన పునాదులు వేసుకొని అంచెలంచెలుగా ఎదిగిన స్వామిగౌడ్ ప్రస్తుతం తెరాస, తెలంగాణా జేయేసీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ దయతో ఇప్పుడు తెరాస అభ్యర్ధిగా పట్టభద్రుల కోటాలో శాసనమండలికి పోటీ కూడా చేస్తున్నారు. ఆయన ఈ ఎన్నికలలో గెలవడం ద్వారా, తన రాజకీయ జీవితంలో మరో మెట్టు పైకెదగనున్నారు.

 

నిజం చెప్పాలంటే, కేసేఆర్ ఆయనను చాల తక్కువ అంచనా వేయడంవల్లనే శాసనమండలికి టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన అందుకు చిన్నబుచ్చుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొంటూ తన రాజకీయ జీవితంలో మరోమెట్టు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలిచిన తరువాత ఆయన రాజకీయ ఎదుగుదల ఏవిదంగా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి ఆయన పూర్తి రాజకీయ పరిపక్వత ప్రదర్శిస్తూ, అటు కాంగ్రెస్ పార్టీలోకో లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకో దూకి మంత్రివర్యులుగా పదవి చేపట్టినా ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే, రేపు కేసీఆర్ కన్నా ఉన్నత స్థాయికి ఎదిగే లక్షణాలు కూడా ఆయనలో పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 

కానీ, ప్రస్తుతం మాత్రం స్వామిగౌడ్ తనదారిలో ఎదురయిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన శాసనమండలికి కూడా పోటీ చేస్తుంటే అయనపై కొన్ని తీవ్రవిమర్శలు చెలరేగుతున్నాయి. ఎందరో అమాయక విద్యార్దులు బలయిన తెలంగాణా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని, ఆయన ఈ విధంగా తన రాజకీయ జీవితాన్ని చక్కబెట్టుకోవడాన్ని చాలామంది ఆక్షేపిస్తున్నారు.

 

కానీ, ఆయన మాత్రం తనను తానూ సమర్దించుకొంటూ, తానూ రాజకీయంగా ఎదగాలనే తాపత్రయంతోనో, లేక పదవీ కాంక్షతోనో ఎన్నికలలో పోటీచేయడం లేదని, కేవలం సీమంద్రవాదులకు తన ఎన్నికతో గట్టిగా బుద్ధి చెప్పాలనే ఒకే ఒక్క ఆలోచనతోనే పోటీ చేస్తున్నానని ఒక వితండవాదం మొదలుపెట్టారు.

 

ఒకవేళ నిజంగా ఆయనకి అదే ఆశయమయితే, మరేవరినో నిలబెట్టి ఆయనను గెలిపించామని అడిగి ఉండాలి. కానీ, అధికారం వచ్చి ఒళ్లో వాలుతున్నపుడు ఎవరు మాత్రం వద్దంటారు? ఎవరు వదులుకొంటారు? అసలు తెలంగాణాలో జరుగుతున్న ఈఎన్నికలతో ఏ సంబందమూ లేని సీమంద్రులకి ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్తాననడమే ఒక తప్పు కాగా, తెలంగాణా అమరవీరుల శవాలనే తన రాజకీయ సోపానాలుగా చేసుకొని పైకెదగాలనుకోవడం మరో పెద్ద తప్పు.

 

ఎప్పుడయితే, అయన తెలంగాణా అంశాన్ని పక్కనబెట్టి ఎన్నికలు, టికెట్లు అని ఆలోచనలు మొదలు పెట్టారో, అప్పుడే తెలంగాణా గుండెల మీద కాలుమోపి ఎదిగే ఆలోచన చేసినట్లే అనుకోక తప్పదు. సాక్షాత్ కేసీఆర్ సోదరుడు మధుసూదన్ రావే ఆయన అవినీతి భాగోతాలు గురించి చెప్తున్నపుడు, ఇక ఆయనకి వేరే వారి సర్టిఫికెట్లు ఎందుకు?

 

రాజకీయాలు ఆయనకీ కొత్తగావచ్చును, కానీ ప్రజలకు ఇటువంటి రాజకీయనాయకులను చూడటం మాత్రం కొత్త కాదు గనుక, ఇకనయినా, ఈ బుకాయింపులు, సంజాయిషీలు అనవసరం అని స్వామి గౌడ్ తెలుసుకోవాలి.