TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమిత్ షా రాజీనామాకు డిమాండ్ .. చేసింది ఎవరో తెలుసా ?

Published on: Fri Jun 3, 2022 3:52PM

కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నో ..రాహుల్ గాంధీ కాదు. మమతా బెనర్జీ, కేసీఆర్ కూడా కాదు. ఆ డిమాండ్ చేసింది, ఇంకెవరో కాదు, సాక్షాత్తూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుభ్రమణ్య స్వామి. నిజమే, గత కొంత కాలంగా స్వామి, బీజేపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు.

త్వరలో ఆయన రాజ్యసభ సభ్యత్వ గడవు ముగుస్తోంది. మరోమారు పార్టీ తమను నామినేట్ చేస్తుందని ఆయన ఆశించారో ఏమో కానీ, 80 ప్లస్ వయసున్న స్వామికి మరో అవకాశం ఇచ్చేందుకు బీజేపీ నాయకత్వం నో.. అనేసింది. నిజమే, స్వామికి నో ..చెప్పడానికి ఆయన వయసు ఒక కారణం అయితే కావచ్చును కానీ, అదొక్కటే  కారణం కాదు, ఆయనకు మోడీ, షా జోడీతో సత్సంబంధాలు లేక పోవడమే అసలు కారణం. నిజానికి, ప్రధాని మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతిపక్షాల కంటే, స్వామి కొంచెం ఎక్కువ ఘాటుగా విమర్శించిన సందర్భాలున్నాయి. ఇలా,స్వామికి మళ్ళీ టికెట్ రాకపోవడానికి కర్ణుడి చావుకు ఉన్నని కారణాలు ఉన్నాయి. అలాగే  స్వామి బీజేపీ నాయకత్వం పై గుర్రుగా ఉండడానికి కూడా అంతకు రెట్టింపు  కారణాలు ఉంటె ఉండవచ్చును. 

అయితే ఇప్పుడు సుబ్రమణ్య స్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా డిమాండ్ చేయాడానికి, ఇదే కారణంమా అంటే, కావచ్చును కాకపోవచ్చును, అనే మాటే పార్టీ  వర్గాలో వినిపిస్తోంది. అయితే, కశ్మీర్‌ లోయలో కశ్మీర్ పండిట్లు, ఇతర ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు సాగిస్తున్న వరుస హత్యల నేపథ్యంలో సుబ్రమణ్య స్వామి, ప్రతిపక్షాలతో గొంతు కలిపారు. కేంద్ర హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశారు. మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌ ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడంతో పాటుగా, ఆయన హోంమంత్రిగా  పనికిరారని అర్ధం వచ్చేలా ఆయనకు క్రీడాశాఖ అయితే బాగుంటుందంటూ ఎద్దేవా చేశారు.

జమ్మూకశ్మీర్‌లో సంవత్సర కాలానికి పైగా రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది,అయినా గత కొంత కాలంగా .అక్కడ వరసగా కశ్మీరీ హిందువులు హత్యలకు గురవుతున్నారు. హిందువులలో 1990 నాటి పరిస్థితులు పునరావృతం అవుతయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 'ద కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమాను తలపించేలా కశ్మీర్‌లో హిందువులు, కశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి.గత నెల రోజుల్లో ఉగ్రవాదులు ఎనిమిది మందిని కిరాతకంగా హత్య చేశారు.  

రెండురోజుల క్రితం కశ్మీర్‌ ప్రాంతంలోని కుల్గామ్‌ జిల్లా గోపాల్‌ పొరాలో రజనీ బాల అనే ఉపాధ్యాయురాలిని బలితీసుకున్న ముష్కురులు.. గురువారం ఓ బ్యాంకు మేనేజర్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపధ్యంలోనే, అమిత్ షా రాజీనామాకు డిమాండ్‌ చేయాల్సిన అవసరం ఏర్పడిందని స్వామి పేర్కొన్నారు. ఆయనకు క్రీడల శాఖ అప్పగిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.  బహుశా, ఇటీవల గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ 2022 ఫైనల్ మ్యాచ్ ని హోంమంత్రి కుటుంబ సమేతంగా చూసిన విషయాన్ని గుర్తు చేస్తూ స్వామి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చును. 

నిజానికి, ఈ టోర్నీ పై అమిత్ షాను టార్గెట్ చేస్తూ స్వామి గతంలో కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టీ 20 మెగా టోర్నీ ఫలితాల్లో రిగ్గింగ్‌ (మ్యాచ్‌ ఫిక్సింగ్‌) జరిగినట్లు నిఘా సంస్థల్లో అనుమానాలున్నాయి.వీటిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలనుకుంటున్నా. ఎందుకంటే భారత క్రికెట్‌ బోర్డుకు అమిత్ షా కుమారుడు ‘నియంత’గా ఉన్నందున ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదు అని స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, రాజ్యసభ టిక్కెట్ రానందుకే, స్వామి, అమిత్ షాను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అదెలా ఉన్నా కశ్మీర్’లో పరిస్థితి అదుపు తప్పుతొందనేది నిజం. అందుకు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం మంత్రి బాధ్యత వహించాలని కోరడంలో తప్పులేదు. ఇందులో మరో  అభిప్రాయానికి తావూ లేదు.