స్వామీజీలు ఉన్నది సీఎం ల కోసమా లేక సామాన్యుల కోసమా

 

 

రాజకీయ నాయకులు మఠాలు, పీఠాల చుట్టూ తిరుగుతూ స్వామీజీల, సన్యాసుల ఆశీర్వచనం తీసుకోవడం కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్బంగా  పొలిటిషియన్లు మఠాధిపతులు కాళ్ళు మొక్కడం వారు ఆశీర్వదించటం మనందరికి  తెలిసిందే. అదే సామాన్యుడు దగ్గరకొస్తే కనీసం కాళ్ళు కూడా తాకనివ్వని పరిస్థితి మనం చూస్తూనే  ఉంటాం. కానీ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు  విశాఖ శారద పీఠం కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు స్వామి స్వరూపానంద సీఎంలను ఆలింగనం చేసుకోవటం అలాగే ముద్దులు పెట్టటం చూస్తుంటే స్వాములు కేవలం తమకు నచ్చిన రాజకీయ నాయకులను మాత్రమే అనుగ్రహించటం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అలాగే పీఠం ఉత్తరాధికారి నియామకాన్ని ఆశ్రమం లో అంతర్గతంగా నిర్వహించవలసిన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించటం చర్చలకు దారి తీస్తోంది.


నిజానికి స్వామీజీలు అంటే సామాన్యులకు జ్ఞాన బోధ చేస్తూ వారి కష్టాలనుండి గట్టెక్కే మార్గం చూపించే వారని మన పెద్దలు చెపుతారు. అలాగే దేశంలో కరువు కాటకాలు రాకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని తపస్సును, హోమాలను నిర్వహిస్తారని చెపుతారు. కానీ నేడు మనం చూస్తున్న ఈ ధోరణి పూర్తిగా ఆడంబరాలు, అట్టహాసం తో నిండి ఉండటమే కాక మఠాలు పీఠాలు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలను శాసించే విధంగా కనిపిస్తున్నాయి. ఒక రాజకీయ నాయకుడిని తన ప్రాణ సమానమని ఆయనను సీఎం చేయడం కోసం సంవత్సరాల తరబడి తపస్సు చేశామని స్వామీజీలు చెప్పుకుంటుంటే ఈ పీఠాలు ఏర్పాటు చేసిన జగద్గురు ఆదిశంకరాచార్య దేనికైతే ఉద్దేశించి వీటిని ఏర్పాటు చేసారో వాటి నుండి పక్క దారి పట్టి ఆయా స్వామీజీలకు నచ్చిన వ్యక్తుల కోసం పని చేసే విధంగా తయారయ్యాయని  ఆవేదన  చెందే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటి స్వామీజీలు తమ ఆశ్రమాలను, పీఠాలను వారి చర్యల ద్వారా మార్కెటింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.