స్వచ్ఛ్ రేస్ లో… గుజరాత్ క్లీన్! ఉత్తర్ ప్రదేశ్ క్లీన్ బౌల్డ్!

మోదీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో స్వచ్ఛ్ భారత్ ఒకటి! ఆయన ప్రధాని అయిన వెంటనే ఈ నినాదం ఎత్తుకున్నారు. అయితే, స్వచ్ఛ్ భారత్ కేవలం సెలబ్రిటిలు చీపుర్లు పట్టుకుని కెమెరాలకు ఫోజులు ఇవ్వటానికే అన్న విమర్శలు వచ్చాయి మొదట్లో. కాని, రాను రాను పరిస్థితిలో మార్పు వచ్చింది. స్వచ్ఛ్ భారత్ నినాదం వెనుక వున్న ఆంతర్యం అర్థమైంది. మేధావుల మాటెలా వున్నా సామాన్య జనం గతంలో కంటే కొంత మెరుగ్గా ఆలోచిస్తున్నారు. మన ఇళ్లు ఎందుకు స్వచ్ఛంగా వుంచుకుంటామో అందుకే మన ఊరు, మన నగరం కూడా స్వచ్ఛంగా వుంచుకోవాలని భావిస్తున్నారు. అనేక రకాల రోగాలకు కారణమైన అపరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన వంటివి తగ్గుముఖం పట్టాయి. భారత దేశమంతటి పెద్ద దేశం రాత్రికి రాత్రి స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లా అందంగా మారిపోవటమైతే కుదరదు కదా…

 

2017 సంవత్సరానికిగానూ కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో నగరాలు, పట్టణాల్లో వస్తోన్న ఆశాజనకమైన మార్పు సంతోషం కలిగించేదే! గతంలో నెంబర్ వన్ స్థానంలో వున్న నగరాలు ఇప్పుడు కిందకి దిగజారాయి. కొత్త నగరాలు పరిశుభ్రంగా మెరిసిపోయాయి. దీనర్థం గతంలో స్వచ్ఛ నగరాలు అనిపించుకున్నవి చెడిపోయాయని కాదు. పోటీలో భాగంగా ఇతర నగరాలు తగు జాగ్రత్తలు తీసుకుని పైకి ఎగబాకయని! ఇది అత్యంత ఆవశ్యకం!

 

స్వచ్ఛత విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు బాగానే బాగానే ర్యాంక్ లు సాధించాయి. అయితే, తెలంగాణ కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మార్కులు కొట్టేసింది. దేశం మొత్తంలోనే మూడో స్వచ్ఛమైన నగరంగా విశాఖ నిలిచింది. తొమ్మిదో స్థానంలో తిరుపతి చోటు దక్కించుకుంది. అంతే కాదు, ఎక్కువ పరిశుభ్రమైన నగరాలు గల రాష్ట్రంగా కూడా ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్, గుజరాత్ తరువాతి స్థానం నవ్యాంధ్రకే దక్కింది.

 

ఇక తెలంగాణ కూడా హైద్రాబాద్ ను 22వ స్థానంలో నిలుపుకుంది. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, సూర్యాపేట లాంటి పట్టణాలు కూడా రేస్ లో మంచి పర్ఫామెన్సే ఇచ్చాయి. అయితే, స్వఛ్ఛ్ భారత్ ఉద్యమంలో తెలుగు రాష్ట్రాల కన్నా ఆశ్చర్యకర ఫలితాలన్నీ ఉత్తరాది రాష్ట్రాల్లోనే వచ్చాయి. అత్యుత్తమ నగరాలు, అతి మురికి నగరాలు రెండూ నార్త్ లోనే ఇమిడిపోయాయి!

 

పన్నెండు అత్యంత పరిశుభ్ర నగరాలతో గుజరాత్ టాప్ క్లీన్ స్టేట్ గా వుండగా రెండో స్థానంలోనూ బీజేపి పాలిత మధ్యప్రదేశ్ నిలిచింది. అయితే, ఈ మధ్యే కమలం ఖాతాలో పడ్డ యూపీ మాత్రం అత్యంత మురికైన నగరాలతో అట్టడుగున నిలిచింది. నాలుగు అత్యంత అపరిశుభ్ర నగరాలు ఉత్తర్ ప్రదేశ్ లోనే వున్నాయి. యోగీ ఆదిత్యనాథ్ వచ్చే స్వచ్ఛ్ సర్వే నాటికి ఎంత వరకూ బాగు చేస్తారో చూడాలి!

 

ఉత్తర్ ప్రదేశ్ లోని నగరాలేవీ టాప్ టెన్ కాదు కదా… టాప్ హండ్రెడ్ లో కూడా నిలవలేకపోయాయి! కేవలం ప్రధాని మోదీ నియోజక వర్గం, విశ్వనాథుని మహాక్షేత్రం వారణాసి మాత్రం 32వ ర్యాంక్ సాధించింది!

 

ఉత్తర్ ప్రదేశ్ తో పాటూ దేశంలో కంపుగొడుతోన్న నగరాలు అత్యధికంగా వున్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్, పంజాబ్, బీహార్, మహారాష్ట్ర. బీహార్ రాష్ట్రం కూడా యూపీ స్టైల్లోనే టాప్ హండ్రెడ్ సిటీస్ లో ఒక్క సిటీని కూడా నిలపలేకపోయింది. టాప్ హండ్రెడే కాదు టాప్ టూ హండ్రెడ్ సిటీస్ లోనూ బీహార్ నగరాలు ఎక్కడా కనిపించలేదు! మరో పెద్ద రాష్ట్రం రాజస్థాన్ పరిస్థితి కూడా అలానే వుంది.

 

పరమ మురికిగా వున్న నగరాలు, పట్టణాలు ఏంటో తెలుసా? యూపీలోని గోండా, మహాలోని బుసావల్, బీహార్లోని బాగా, ఉత్తర్ ప్రదేశ్ లోని హర్దోయ్. బీహార్ కే చెందిన కతిహార్.. టాప్ ఫై చెత్త సిటీలుగా మిగిలాయి. అయితే, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విడ్డూరం ఏంటంటే… మమతా బెనర్జీ ఆధీనంలోని బెంగాల్ స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో అసలు పాల్గొనలేదు! పాల్గొని వుంటే ఆ రాష్ట్రం నుంచి కూడా దుర్వాసన బాగానే వచ్చి వుండేది!

 

ఒక్కసారి 434 నగరాలు, పట్టణాల పూర్తి లిస్టు పరికిస్తే మనకు ఒక్క విషయం స్పష్టమవుతుంది. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీలు… ఇలా ఎవరి ఏలుబడిలో వున్నా శుభ్రమైన నగరాలు, పట్టణాలు, అపరిశుభ్రమైన నరక కూపాలు అన్ని చోట్లా వున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు సమిష్ఠిగా కృషి చేసి దేశాన్ని అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలి. అది నిస్సందేహంగా మన మంచికే. అంతేకాక 2019 అక్టోబర్ 2 నాటికి… అంటే మహాత్ముని 150వ జయంతి నాటికి దేశంలో ఎవ్వరూ బహిరంగ మల విస్టర్జనకి పాల్పడకుండా వుండేలా చూసుకోవాలి! అలా జరిగితేనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా మనకు ప్రపంచం ముందు గౌరవం దక్కుతుంది!