హైదరాబాద్..అమరావతి ఇప్పుడు ఢిల్లీకి రాజమౌళి..?

సన్మానాలు, సత్కరాలు, కోరి వరిస్తున్న అవార్డులు..ఏ చిన్న కార్యక్రమం జరిగినా చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానాలు అబ్బో నిజంగా టైమ్ అంటే ఇదేనేమో అనిపిస్తుంది కదూ.? ప్రజంట్ రాజమౌళి పరిస్థితి అలాగే ఉంది. బాహుబలి విజయంతో రాజమౌళి రేంజ్ ఆకాశాన్ని తాకింది. ఆయన్ను కలిసే ఏ చిన్న అవకాశాన్ని కూడా టాలీవుడ్ ప్రముఖులు మిస్ అవ్వడం లేదు. సినీ పరిశ్రమ పరంగా ఏ కార్యక్రమం జరిగినా ఇప్పుడు ముఖ్యఅతిథి రాజమౌళీనే. ఈ నేపథ్యంలో వచ్చి పోయే వారితో ఆయన నివాసం సందడి సందడిగా ఉంటోంది.

 

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని..ఆయన కృషికి సత్కారంగా పద్మశ్రీ అవార్డునిచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం.. తాజాగా మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్నార్ జాతీయ అవార్డు కూడా జక్కన్నను వరించింది. అలా వరుస సత్కారాలతో బిజీగా ఉన్న రాజమౌళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పిలుపొచ్చింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచంలోని అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలని కలలుగంటోన్న నాయుడు గారు తన కార్యంలో రాజమౌళిని భాగం చేయాలనుకున్నారు. బాహుబలిలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని విక్షీంచిన సీఎం అమరావతిలోని భవన నిర్మాణాల్లో అలాంటి సృజనాత్మకతనే కోరుతున్నారు. అందుకే మీ సేవలు కావాలి బ్రదర్ అంటూ కబురుపెట్టారు.. ముఖ్యమంత్రిగారు పిలవడమే ఆలస్యం జక్కన్న అమరావతిలో ల్యాండైపోయారు .. చంద్రబాబును కలిసి అమరావతి నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. పనిలో పనిగా సీఆర్‌డీఏ అధికారులతో కలిసి రాజధాని ప్రాంతాన్ని చుట్టేసి వర్క్ స్టార్ట్ చేసేశారు కూడా.

 

అలా అమరావతిలో పని ముగించుకొని హైదరాబాద్‌లో దిగారో లేదో నెక్ట్స్ రాజమౌళికి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రారంభించిన "స్వచ్ఛ హీ సేవా" కార్యక్రమంలో భాగం కావాలని మోడీ స్వయంగా రాజమౌళికి లేఖ రాశారు. "వినోద రంగంలో ఎంతో గుర్తింపును తెచ్చుకున్న మీ వంటి వారు ముందడుగు వేస్తే ఎంతోమంది మీ వెనుక నడుస్తారు..సమాజ అభివృద్ధికి ఇది ఎంతో కీలకం..నేను మిమ్మల్ని స్వచ్ఛ హీ సేవలో భాగం కావాలని స్వయంగా ఆహ్వానిస్తున్నాను. మీ అనుభవాన్ని ఎప్పుడైనా నాతో పంచుకోవచ్చు..గాంధీ జయంతి నాటికి ఈ కార్యక్రమాన్ని 125 కోట్ల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మీ సహకారాన్ని కోరుతున్నాను" అంటూ మోడీ లేఖలో పేర్కొన్నట్లు జక్కన్న తెలిపారు.

 

సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుండే రాజమౌళి..ప్రధాని పిలుపునిచ్చిన ఎన్నో కార్యక్రమాలకు బహిరంగ మద్ధతు ప్రకటించారు. స్వచ్ఛభారత్, స్వదేశీ ప్రచారానికి తన వంతు సహాయ సహకారాలుంటాయని చెప్పారు కూడా..గతేడాది దీపావళి సందర్భంగా డియర్ భారత్ వాసి...స్వదేశీ వస్తువులను కొనండి..విదేశీ వస్తువులను బహిష్కరించండి. మనదేశ ఆర్థిక ప్రగతిని పెంచండి..అంటూ మోడీ పోస్ట్ చేసిన సందేశాన్ని రాజమౌళి షేర్ చేశారు. అలా మంచి పనులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు జక్కన్న. అలాంటిది మరి ఏకంగా మోడీ నుంచే కాల్ వస్తే వెళ్లకుండా ఉంటారా...? చెప్పండి..?