Latest News
‘స్వచ్చ భారత్’ ఆరంభ శూరత్వం కాకూడదు
posted on: Oct 2, 2014 10:56AM

మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలయింది. కేంద్రప్రభుత్వానికి భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చాలనే ఆలోచన కలగడమే ఒక మంచి శుభపరిణామం అనుకొంటే, ప్రధాని మోడీ ప్రకటించిన ఈ కార్యక్రమానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీల నుండి మంచి సానుకూల స్పందన రావడం మరో మంచి పరిణామమని చెప్పవచ్చును. అదేవిధంగా ప్రజలు, వివిధ స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు, పరిశ్రమలు అన్నీ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు రావడం గమనిస్తే, సమర్దుడయిన నాయకుడు ఆచరణ యోగ్యమయిన కార్యక్రమాలతో ముందుకు వచ్చినట్లయితే యావత్ దేశ ప్రజలు ఆయనకు తమ పూర్తి సహకారం అందించేందుకు ఎల్లపుడు సంసిద్దంగానే ఉంటారని మరో మారు రుజువు చేసారు.
అయితే సాధారణంగా ఇటువంటి గొప్ప ఆలోచనలు, ఆశయాలు, కార్యక్రమాల అమలులో ఆరంభ శూరత్వం మాత్రమే కనిపిస్తుంటుంది. కొన్ని రోజులో వారాల తరువాత ఇటువంటి కార్యక్రమాలు అటకెక్కిపోతుంటాయి. మంత్రులు అందరూ ఏదో ఒక్కరోజు చీపుర్లు పట్టుకొని రోడ్ల మీద హడావుడి చేసినంత మాత్రాన్న దేశం శుభ్రమయిపోదు. అందువలన ఈ ‘స్వచ్చ భారత్’ కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే తప్ప మోడీ ఆశయం నెరవేరదు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన విధంగా తమ కార్యాచరణ, పధకాలు రూపొందించుకోవాలి.
ఈ మహాయజ్ఞంలో ప్రజలు, వివిధ సంస్థలు పాల్గొనేలా చేసి అందుకు వారికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తే మంచి ఫలితాలు కనబడవచ్చును. ప్రజలు కూడా తమ ఇళ్ళను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకొంటారో అదేవిధంగా తమ వీధులను, గ్రామాలను, పట్టణాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొనేలా చైతన్యపరచాలి. బహిరంగ ప్రదేశాలలో విధిగా శుభ్రత పాటించాలనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలి. అవసరమయితే సింగపూరులో లాగ జరిమానాలు వేసినా తప్పులేదు. కానీ అంతకంటే ముందు బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత పాటించేందుకు అవసరమయిన సౌకర్యాలు అంటే చెత్త బుట్టలు, మరుగు దొడ్లు వాటిని సూచించే బోర్డులు వంటివన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అందుకు వివిధ సంస్థల సహాయసహకారాలు కోరవచ్చును.
అయితే ఇటువంటి విషయాలన్నిటినీ బాల్యం నుండే పిల్లలకు నేర్పిస్తూ వారి ‘మైండ్ సెట్’ మార్చగలిగితే ఇప్పుడు మొదలు పెట్టిన ఈ మహాయజ్ఞాన్నిఆ భావి భారత పౌరులు కూడా కొనసాగించగలుగుతారు. ఏమయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి, ఒక గొప్ప కార్యక్రమం మొదలుపెట్టింది. దానిని ఇదే స్పూర్తితో, పట్టుదలతో నిష్టగా ఇకముందు కూడా కొనసాగిస్తే అభినందించవలసిందే.


.jpg)
.jpg)


