TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సువేందు అధికారి పీఏ దారుణ హత్య

Published on: Thu May 7, 2026 8:11AM

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింస ప్రజ్వరిల్లింది. ఈ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన రెండు రోజుల వ్యవధిలోనే ఆ పార్టీ కీలక నేత..  జెయింట్ కిల్లర్’  సువేందు అధికారి  పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో బుధవారం రాత్రి ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చి హత్య చేశారు.  దోహరియా ప్రాంతంలోకి ఆయన కారును వెంబడించి వచ్చిన దుండగులు చంద్రనాథ్ రథ్‌పై   నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా..  అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దాడిలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు.  

 ఈ హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ (  హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి జరిగినప్పుడు సువేందు అధికారి తన పీఏతో లేరని ఆయన సోదరుడు దిబ్యేందు అధికారి తెలిపారు. ఇది టీఎంసీ పెంచి పోషించిన హింసాత్మక సంస్కృతికి నిదర్శనమని.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు..  టీఎంసీ ఈ హత్యను తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, దోషులను కఠినంగా శిక్షించాలని పేర్కొంది. గత మూడు రోజులుగా బీజేపీ మద్దతుదారులే పోస్ట్ పోల్ హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.