TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

Published on: Sat May 9, 2026 3:45PM

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో నేడు ఒక కీలక అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ కాలం పాటు వామపక్షాలు, ఆపై తృణమూల్ కాంగ్రెస్ పాలించిన ఈ రాష్ట్రంలో, ఇప్పుడు కమల దళం అధికారాన్ని దక్కించుకుని చరిత్ర సృష్టించింది. 

సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాది మంది కార్యకర్తల జయజయధ్వానాల మధ్య, రాష్ట్ర గవర్నర్ సువేందు అధికారితో పదవీ ప్రమాణం చేయించారు.  

సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే..  కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు.  సువేందు అధికారి  మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో  చేరి ఆ పార్టీలో  కీలక నేతగా ఎదిగారు. ముఖ్యంగా నందిగ్రామ్ రైతాంగ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మమతా బెనర్జీని అధికార పీఠంపై కూర్చోబెట్టడంలో అత్యంత కీలకం.

అయితే, తృణమూల్ కాంగ్రెస్‌లో ప్రాధాన్యత తగ్గుతోందని భావించిన సువేందు..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ ను వీడి బీజేపీలో చేరారు.  అప్పట్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఢీకొని విజయం సాధించారు. దీంతో సువేందు పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ విజయం ఆయనను బీజేపీలో తిరుగులేని నాయకుడిగా మార్చడమే కాకుండా.. నేడు ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేలా చేసింది.

ఈ విజయోత్సాహం మధ్యే సువేందు అధికారిపై ప్రతిపక్షాల విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. గతంలో సువేందు తృణమూల్‌లో ఉన్నప్పుడు ఆయనపై ప్రధాని మోదీ స్వయంగా అవినీతి ఆరోపణలు చేశారనీ.. ఇప్పుడు వాటన్నిటినీ మరిచిపోయి సువేందును ముఖ్యమంత్రిని చేయడమే కాకుండా, ఆయన ప్రమాణస్వీకారినికి కూడా హాజరవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజనులు  ప్రధాని మోడీ ద్వంద్వ ప్రమాణాలను నిలదీస్తున్నారు.