కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై వేటు తప్పదా?

 

రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కారణంగా వీరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని టీఆర్‌ఎస్‌ గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ ముగ్గురు సభ్యులకు నోటీసులిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చివరి దశకు చేరుకుంది. తాజాగా మండలి చైర్మన్‌ రాములునాయక్‌ అంశంపై విచారణ జరిపారు. టీఆర్‌ఎస్‌ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్‌లో చేరినందుకు ఫిరాయింపుల చట్టం కింద వేటువేసే అవకాశం ఉందని తెలిపారు. రాములునాయక్‌ తరఫు న్యాయవాది దీనిపై తన వాదనలను లిఖితపూర్వకంగా తెలిపారు. మరికొంత సమయం కావాలని కోరగా, మండలి చైర్మన్‌ నిరాకరించినట్లు తెలిసింది. విచారణ పూర్తయినందున త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి సభ్యత్వ రద్దుపై ఉన్న పిటిషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది. ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో ఒకేసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీరిపై వేటు పడితే మండలిలో మూడు స్థానాలు ఖాళీ అవుతాయి. కాగా మండలిలో ఖాళీ అయ్యే స్థానాలకు రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వీటితోపాటే ఈ మూడు స్థానాలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.