పీసీసీ ఎంపికలో చేతులెత్తేసిన ఠాగూర్! పార్టీ సీనియర్ల తీరుపై కేడర్ ఫైర్ 

రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట. తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి కూడా అచ్చం అలానే ఉంది. వరుస పరాజయాలతో పార్టీ భవిష్యతే ఆగమ్యగోచరంగా తయారైనా.. హస్తం నేతల తీరు మాత్రం మారడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పీసీసీ చీఫ్ పదవి కోసం వర్గ పోరుకు తెర తీశారు. పార్టీ ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితుల్లో ఏకాభిప్రాయంతో పీసీసీ చీఫ్ ను ఎన్నుకోవాల్సింది పోయి.. బల ప్రదర్శనకు దిగారనే చర్చ కాంగ్రెస్ కేడర్ లో జరుగుతోంది. తనకు రాకపోయినా ఫర్వాలేదు గానీ ఫలానా వ్యక్తికి రావద్దని అడ్డుకునే ప్రయత్నాలు కొందరు చేస్తుంటే.. తనకు ఇవ్వకుంటే పార్టీకి రాజీనామా చేస్తానని మరికొందరు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారట.

 

కాంగ్రెస్ నేతల తీరుతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ నాలుగు రోజుల పాటు గాంధీభవన్ లో కూర్చుని కసరత్తు చేసినా పీసీసీ అధ్యక్ష ఎంపిక కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. ఈ నెల 9న టీపీసీసీ కోర్‌ కమిటీ సభ్యులతో ప్రారంభమైన అభిప్రాయ సేకరణ శనివారం వరకు జరిగింది. పార్టీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలు, డీసీసీ అధ్యక్షులు, కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థుల నుంచి ఠాగూర్‌ విడివిడిగా అభిప్రాయాలను తీసుకున్నారు. టీపీసీసీ రేసులో ముందు చాలా మంది నేతల పేర్లు వినిపించినా.. చివరకు మాత్రం ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉందని చెబుతున్నారు. పార్టీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారంటున్నారు. ఎవరూ పట్టు వీడకపోవడంతో ఏకాభిప్రాయం సాధించడంలో మాణిక్కం ఠాగూర్ కూడా చేతులెత్తేశారనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది. ఎటూ తేలకపోవడంతో ఆయన కూడా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఏఐసీసీ నివేదిక ఇచ్చి తప్పించుకునే ఆలోచనలో మాణిక్కం ఠాగూర్ ఉన్నట్లు చెబుతున్నారు. 

 

యథా లీడర్ తథా కేడర్ అన్నట్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలానే తయారయ్యారు. తమ నేతకే పీసీసీ పగ్గాలివ్వాలంటూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు. తమ నేతకు పీసీసీ పగ్గాలు ఇవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు కాని.. పీసీసీ రేసులో ఉన్న ఇతర కాంగ్రెస్ నేతలను వారు టార్గెట్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ జరుగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వర్గాలుగా విడిపోయి పోటాపోటీ పోస్టులు పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు వాదనకు దిగుతూ తమ పార్టీ లోపాలను వారే బయట పెట్టుకుంటున్నారు. 33 డీసీసీల్లో 20 జిల్లా అధ్యక్షులు రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చారని రేవంత్ గ్రూప్ ప్రచారం చేస్తే.. 23 జిల్లా అధ్యక్షులు వెంకట్ రెడ్డికి సపోర్ట్ చేశారని కోమటిరెడ్డి గ్రూప్ కౌంటర్ పోస్టులు పెడుతోంది. సీనియర్ నేతల మాదిరిగానే కార్యకర్తలు కూడా గ్రూపులుగా విడిపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  

 

పీసీసీ చీఫ్ మార్పు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా  కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు బయటికి వస్తుంది. నేతల మధ్య మాటల యుద్ధం, గ్రూపు తగాదాలు, లుకలుకలు షరా మామూలే. సీనియర్ నేతలంతా పీసీసీ రేసులో నేనున్నాంటూ దరఖాస్తు చేసుకోవడం, లాబీయింగ్ చేసుకోవడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఎవరికి ఇచ్చినా ఇంకొరికి కోపం. సహాయ నిరాకరణ, గ్రూపుల తగాదాలు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఇస్తే పార్టీ ఏమవుతుందోనని ఏఐసీసీకి భయం. సీనియారిటీ, సొంత పార్టీ వారికే అవకాశం ఇవ్వాలనే వాదన, రెడ్డి సామాజిక వర్గానికి బదులుగా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్.. ఇలా అనేకం ఆ పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పీసీసీ చీఫ్ మార్పు నెత్తిమీద కుంపటిలా తయారైందని చెబుతున్నారు. పార్టీ బలోపేతం, అధికారంలోకి రావడం వంటి విషయాలు కాంగ్రెస్ సీనియర్లకు పట్టడం లేదని, పదవుల కోసమే కీచులాడుతూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

 

పార్టీ హైకమాండ్ కూడా త్వరగా పీసీసీ చీఫ్ ఎవరో తేల్చాలని, లేదంటే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళన కొందరు కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు వెళ్లిపోయారని, మరికొందరు అదే బాటలో ఉన్నారంటున్నారు. ఇతర పార్టీలు నేతలను తన్నుకుపోవడానికి కాచుకుని ఉంటే.. పదవుల కోసం సీనియర్లు తగాదా పడటం ఎంత వరకు కరెక్ట్ అన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల నుంచి వస్తోంది. సీనియర్ నేతల తీరు మారకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లా మారిపోతుందని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు ఉన్నా నాయకుల అసమర్దత వల్లే పార్టీ అధికారంలోకి రాకపోయిందనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది.