TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్‌కి మరో లడ్డూ దొరికింది

Published on: Mon Jun 15, 2015 8:15PM



బీజేపీ మీద విమర్శలు గుప్పించడానికి ఏ అవకాశం దొరికినా కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు. ఆ మాటకొస్తే ఎక్కడ అవకాశం దొరుకుతుందా... లడ్డూలాగా దాన్ని అందుకుందామని ఎదురుచూస్తోంది. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో లడ్డూ దొరికింది. అది కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తీసుకున్న ఒక నిర్ణయం రూపంలో. అయితే ఆ నిర్ణయంలో మానవతా కోణం కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వుండటం విచారకరం. అయితే సుష్మా స్వరాజ్ నిర్ణయం మీద కాంగ్రెస్ చేస్తున్న వాదనలో పస లేదని అర్థమవుతూ వున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న న్యూసెన్సే చిరాకును తెప్పిస్తోంది.

ఐపీఎల్ వివాదంలో ఇరుక్కున్న లలిత్ మోడీ అనే పెద్దమనిషి విదేశాలకు వెళ్ళడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు. అయితే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో వున్న సుష్మా స్వరాజ్ ఆయనకు అనుమతి మంజూరు చేశారు. అదికూడా ఏ విహార యాత్రకో వెళ్ళిరావడానికో కాదు.. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన భార్యకు పోర్చుగల్‌లో చికిత్స జరిపించుకోవడానికి వీలుగా అనుమతి ఇచ్చారు. లలిత్ మోడీ ఆర్థిక నేరగాడే తప్ప ఏ తీవ్రవాదో కాదు.. ఆయన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయే అవకాశాలు కూడా ఎంతమాత్రం లేవు. అలాంటి వ్యక్తికి మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ నానా కచరా చేస్తోంది. మీడియాకి ఎక్కి మోడీ మీద విరుచుకుపడుతోంది. సుష్మా స్వరాజ్ వీలైతే మోడీ కూడా రాజీనామా చేసేయాలని పట్టుబడుతోంది. ఈ వివాదంలో సుష్మా స్వరాజ్‌కి బీజేపీ అండగా నిలిచి కాంగ్రెస్ మీద ఎదురుదాడికి దిగడం ఆమెకు కొంత ఊరట కలిగించే అంశం. అయితే కాంగ్రస్ లాంటి మానవత్వం లేని పార్టీ ఏ వివాదం రేపడానికైనా రెడీగా వుంటుందన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తుంచుకుని వ్యవహరిస్తే ముందు ముందు ఇలాంటి తలనొప్పులు వుండవు.