పాక్ కు ధీటైన సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్న సుష్మ..

 

ఐరాస సర్వసభ్య సమావేశాల్లో పాకిస్థాన్ ప్రధాని భారత్ పై ప్రేలాపనలు చేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో అల్లకల్లోలానికి భారత్ కారణమని ఆరోపిస్తూ, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీని పొగుడుతూ ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై అగ్రరాజ్యాలు సైతం మండిపడ్డాయి. ఇప్పుడు దీనికి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ధీటైన సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐరాస సర్వసభ్య సమావేశాల్లో పాల్గొనే నిమిత్తం ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న ఆమె... ఆయన వాదనను ఖండిస్తూ, పాక్ చేస్తున్న కుట్రలను అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్లి, పాక్ వైఖరిని ఎండగట్టేందుకు సుష్మా ప్రయత్నించనున్నారు. ఆమె ప్రసంగం నేటి రాత్రి 7:20 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మొదలు కానుంది. దీనిలోభాగంగానే ఆమె ప్రసంగించాల్సిన అంశాలపై ఇప్పటికే మోదీతోను, రక్షణ, హోం శాఖల మంత్రులతోను ఆమె చర్చించారు. ముఖ్యంగా పాక్ ఎలా ఉగ్రవాదులకు సహకరిస్తున్నది, యుద్ధ నేరాలకు ఎలా పాల్పడుతున్నది అన్న దానిపై ప్రసంగించనున్నారు.