ఒలింపిక్స్‌లో స్థానం కోసం కోర్టుల్లో కుస్తీ
Published on: Tue May 17, 2016 4:32PM

సుశీల్ కుమార్- ఒలంపిక్స్‌లో మన దేశానికి పతకాన్ని సాధించిన మల్లయోధుడు. 50 ఏళ్ల విరామం తరువాత మన దేశానికి కుస్తీ పోటీల్లో ఒలంపిక్ పతకాన్ని తీసుకురావడమే కాకుండా, వరుసగా రెండు ఒలంపిక్స్‌లో పతకాలను సాధించిన తొలి భారతీయుడు. అలాంటి సుశీల్ కుమార్ రాబోయే ఒలంపిక్స్‌లో తనకు స్థానం కల్పించాలంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. సుశీల్ కుమార్ ఉదాహరణ చూస్తే మన దేశంలోని క్రీడా సమాఖ్యలు ఎంత తీరుగా నడుస్తున్నాయో తెలుస్తుంది. మొదటి నుంచీ తనతో సంప్రదించకుండా, విషయాన్ని సరిగా తెలియచేయకుండా... భారతీయ రెజ్లింగ్ సమాఖ్య తన ఇష్టమొచ్చినట్లు నిర్ణయం తీసుకుందన్నది సుశీల్ ఆరోపణ. సుశీల్ 66 కిలోల ఫ్రీస్టైల్ నుంచి 74 కిలోల విభాగానికి హఠాత్తుగా మారాడనీ, అతని కోసం 74 కిలోల విభాగంలో ప్రతిభను కనబరుస్తున్న నర్సింగ్ యాదవ్‌ను తప్పించలేమన్నది రెజ్లింగ్ సమాఖ్య వాదన. అయితే కోర్టు మాత్రం సుశీల్ కుమార్ మాటను మరోసారి ఆలకించవలసిందిగా రెజ్లింగ్ సమాఖ్య ముఖ్యులని ఆదేశించింది. అయితే ఈ కేసు ఇక్కడితో ముగిసిపోలేదు. కోర్టు తన తదుపరి విచారణలో ఈ సమస్యకు మరో మార్గాన్ని కూడా చూపే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే నర్సింగ్ యాదవ్, సుశీల్ కుమార్‌ల మధ్య ఒక పోటీని నిర్వహించి, తద్వారా ఒలంపిక్స్‌లో పాల్గొనే అర్హతను నిర్ణయించమని కూడా కోర్టు ఆదేశించవచ్చు. సుశీల్ కోరుకుంటున్నది కూడా ఇదే! అయితే ఇలాంటి బాహాబాహీ పద్ధతులు మొదలైతే మున్ముందు ప్రతి ఒక్కరూ కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉంటారని రెజ్లింగ్ సమాఖ్య కంగారుపడుతోంది. మరి ఇంతగా కంగారుపడే సమాఖ్య, వివాదాన్ని ఇక్కడిదాకా ఎందుకని లాక్కు రాకుండా ఉండాల్సింది కదా! దేశానికి పతకాన్ని అందించిన క్రీడాకారులు, అన్యాయం జరిగిపోయిందో అంటూ కోర్టు బోనులకి ఎక్కడం ఎంత అవమానకరం?


