రాజీనామా చేస్తానన్న మంత్రి.. సముదాయించిన మోడీ...

 

యూపీలో ఇటీవల వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్కల్ ఎక్స్ ప్రెస్ ముజఫర్‌నగర్ జిల్లాలోని ఖతౌలీ వద్ద పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా.. అజమ్‌గఢ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ యూపీ ఔరియా జిల్లాలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ.. 70 మంది గాయపడ్డారు. ఇక ఈ నేపథ్యంలో వరుస రైలు ప్రమాదాలపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఆయన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేశారు. అయితే అలాంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని..తొందరపడొద్దని సముదాయించారట. ప్రధాని కలిసిన అనంతరం సురేష్ ప్రభు మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాదాలు ఎంతో దురదృష్టకరమని, తనకు ఎంతో బాధను కలిగించాయని తెలిపారు.