TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రపతి, గవర్నర్ కు కాలపరిమితిపై సుప్రీం తీర్పు నేడు

Published on: Thu Nov 20, 2025 9:10AM

చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ లకు కాలప పరిమితి నిర్ణయించే విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం గురువారం (నవంంబర్ 20)తీర్పు వెలువరించనుంది.  దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది.  చట్ట సభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం రాజ్యాంగబద్ధమేనని కొందరు వాదిస్తుండగా, మరి కొందరు అది అధికారాల విభజనను ఉల్లంఘించడమే అవుతుందంటున్నారు.  

తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా సుదీర్ఘకాలం జాప్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం, బిల్లులపై గవర్నర్లు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేననీ, అలా తీసుకోకుంటే.. ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే భావించాలని తీర్పు ఇచ్చింది.  దీంతో తమిళనాడు ప్రభుత్వం 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేసింది.

దీంతో..  రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గడువులు విధించడం సరికాదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.  ఇదే అంశంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకున్న అధికారాలతో సుప్రీంకోర్టు సలహా  కోరారు.  బిల్లుల ఆమోదం విషయంలో రాష్ట్రపతి, గవర్నర్ల అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుని గడువులు నిర్దేశించవచ్చా? స్పష్టత ఇవ్వాలంటూ సుప్రీంను కోరారు.  

రాష్ట్రపతి అభ్యర్థన మేరకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు గవర్నర్లకు గడువు విధించడాన్ని వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే   పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తూ..  గవర్నర్లు తమ నిర్ణయాన్ని నిర్దుష్ట కాలవ్యవధిలో తీసుకోవాలని వాదించాయి.  

ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత ససెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న  సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ ఈ  ఆదివారం(నవంబర్ 23) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణకు ముందు ఈ కీలక అంశంపై తీర్పు వెలువరించనుండటం గమనార్హం.