TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సుప్రీంలో ఉద్ధవ్ కు చుక్కెదురు.. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణకు నో!

Published on: Mon Jul 11, 2022 2:05PM

కష్టాలు ఒకే సారి కట్టకట్టుకుని వస్తాయంటారు. ప్రస్తుతం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరిస్థితి అలాగే ఉంది. ఒక వైపు మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే శిబిరంలోకి చేరిపోవడం, శివసేన పార్టీ, గుర్తు కూడా తన నుంచి దూరమయ్యే ప్రమాదం వంటి కష్టాలలో కొనసాగుతున్న ఆయనకు సుప్రీంలో కూడా చుక్కెదురైంది.

షిండే వర్గంలోకి జంప్ అయిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రేకు అక్కడా చుక్కెదురైంది. అనర్హత పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం అభిప్రాయపడింది.  మహారాష్ట్రలో ప్రస్తుతం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సోలిసిట్ జనరల్ కు స్పష్టం చేసింది.

ఇదే విషయాన్ని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కు తెలియజేయాలని ఆయనను ఆదేశించింది. ఈ కేసు విచారణకు ధర్మాసనం ఏర్పాటు చేయాల్సి ఉందనీ, ధర్మాసనం ఏర్పాటుకు సమయం పడుతుందని సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పేర్కొన్నారు. అంత వరకూ యథాతథ స్థితి కొనసాగించాలని సోమవారం ఈ కేసు విచారణ సందర్శంగా జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు నిర్ణయంతో షిండే వర్గానికి   ఊరట లభించింది.