TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోకు సుప్రీంలో చుక్కెదురు!

Published on: Sat Nov 19, 2022 10:11AM

జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరోకు సుప్రీంలో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసులో తమపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ హెటిరో సుప్రీంలో దాఖలు చేసిన పిటిష్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. హెటిరోపై దాఖలైన కేసులో దాచేయాలని ప్రయత్నించినా దాగని వాస్తవాలు ఉన్నాయని పేర్కొంది.

ఈ కేసులో హెటిరో విచారణను ఎదుర్కొని తీరాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డితో పాటు హెటిరో గ్రూప్‌ను కేసు నుంచి తొలగించేందుకు నిరాకరిస్తూ గత ఏడాది నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు  తీర్పు ఇచ్చింది. అయితే హెటిరో  సుప్రీంకోర్టులో  సవాల్ చేసింది. అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డిని, హెటిరో సంస్థను సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. జగతిలో జగన్ ఒక్క రూపాయి కూడా పెట్టబడి పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారని సీబీఐ  చార్జిషీటు దాఖలుచేసింది.

జగతిలో వాటాలను ఇతరులకు అమ్మడానికి వీల్లేదని, వాటాదారులు కుటుంబసభ్యులకు మాత్రమే బదలాయించాలన్న షరతు ఉంది. హెటిరో రూ.1,173 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. వారికి దక్కింది కేవలం 30 శాతమే! జగన్‌ కేవలం రూ.73 కోట్ల పెట్టుబడితో 70 శాతం వాటా పొందారు. ఆ రూ.73 కోట్లు కూడా ఆయనకు చెందిన కార్మెల్‌ ఏసియా, సండూర్‌ పవర్‌ల నుంచి వచ్చాయి. వాటిలోనూ ఇతరులే పెట్టుబడులు పెట్టారు.

అంటే.. రూపాయి వెచ్చించకుండా రూ.1,246 కోట్ల పెట్టుబడులను జగన్‌ రాబట్టారు. అధికార దుర్వినియోగం, ప్రజా విశ్వసనీయతను దెబ్బతీయడం.. అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి వస్తాయని సీబీఐ వాదించింది. ఇప్పుడు ఆ చార్జిషీట్ లోని అంశాలనే  దాచేస్తే దాగని సత్యాలుగా  సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితులుగా కొంతమందిని చేరిస్తే పర్వాలేదు కానీ.. మొత్త కంపెనీని చేర్చడమేమిటని హెటిరో తరపు న్యాయవాది వాదించారు. అయితే ఆ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.