TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తీర్పు అమలు చేయని తెలంగాణ సర్కార్ పై సుప్రీం ఫైర్

Published on: Tue Jun 7, 2022 6:02PM

కోర్టు తీర్పులను అమలు చేయకపోవడం అన్నది ఇటీవలి కాలంలో ప్రభుత్వాలకు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది.   గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టుల రిజర్వేషన్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ సుప్రీం కోర్టు గతంలో జరిమానా విధించింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ జరిమానా చెల్లించలేదు. దీనిపై దేశ సర్వోన్నత న్యాయ స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజన ప్రాంతాలలో టీచర్ల నియామకం విషయంలో వందశాతంఎస్టీ రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో ఉభయ తెలుగు రాష్ట్రాలూ తీసుకున్న నిర్ణయాన్నిఅప్పట్లోనే సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆ సమయంలో  తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రెండున్నర లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జరిమానా మొత్తాన్ని రెండు వారాల్లోగా చెల్లించాలనీ ఆదేశించింది.

అయితే తెలంగాణ సర్కార్ ఆ ఆదేశాన్ని అమలు చేయలేదు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోస్ లతో కూడిన ధర్మాసనం ఈ రోజు (మంగళవారం) ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా చెల్లించకుంటే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనన్న తమ ఆదేశాలను ఖాతరు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

అయితే సుప్రీం తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసిందనీ, అది పెండింగ్ లో ఉన్నందున చెల్లించలేదనీ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీంతో మంగళవారం నుంచి రెండు వారాల్లోగా జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గిరిజన ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాలలోనూ రిజర్వేషన్లు రాజ్యాంగానికి లోబడే ఉండాలని గతంలోనే ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విస్పష్ట తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.