అంతా స్పీకర్ ఇష్టమేనని తేల్చిన సుప్రీం...సర్కార్ మాదేనంటున్న యెడ్డీ !

 

కర్ణాటక‌లో రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్ మీద వాదనలు వింటున్న సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఆ ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణీత గడువులో నిర్ణయం తీసుకోవాలని తాము స్పీకర్‌పై ఒత్తిడి చేయలేమని పేర్కొంది. ఎమ్మెల్యేల రాజీనామాను అంగీకరించాలా లేదా అనేది స్పీకరే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అంతేకాక బలపరీక్షలో పాల్గొనాలని ఎమ్మెల్యేలను బలవంతం చేయకూడదని ఈ సందర్భంగా ఆదేశించింది. 

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనురుద్ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై కర్ణాటక‌ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగం ప్రకారమే తాను విధులను నిర్వహిస్తానని తెలిపారు. మరో పక్క బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ, ‘ఇక ప్రభుత్వం పడిపోతుంది. 

ఎందుకంటే వారికి కావాల్సినంత బలం లేదని పేర్కొన్నారు. 14 నెలల నుంచి కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇందులో 78 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాగా, 37 మంది జేడీఎస్ సభ్యులు, ఒకరు బీఎస్పీ, మరొక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీకి 105 మంది సభ్యలుండగా, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది. ఇప్పుడు 15 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఎదురు తిరిగారు. వారు రేపు జరిగే బలపరీక్షలో పాల్గొనకపోతే అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 209కి తగ్గుతుంది. 

మ్యాజిక్‌ ఫిగర్‌ 105 అవుతుంది. ఈ సమయంలో కుమారస్వామి వర్గానికి ఇన్న బలం 102 మాత్రమే కాగా బీజేపీకి 107 మంది బలం ఉంది. ఆ 15 మందిలో కనీసం ఏడెనిమిది మందిని అయినా బాల పరీక్షకు తెలేకుంటే ప్రభుత్వం కూలిపోక తప్పదు. ఇదిలా ఉంటే యడ్యూరప్ప ఇవేవి పట్టనట్లుగా రిలాక్స్‌గా కనిపించారు. బెంగళూరులోని రమాదా హోటల్‌ ప్రాంగణంలో యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.