అయోధ్య వివాదంపై నేడు సుప్రీంలో వాదనలు
Published on: Fri May 10, 2019 11:07AM

అయోధ్యలో రామమందిరం- బాబ్రీ మసీదు భూవివాదానికి సంబంధించిన కేసు వాదనలను శుక్రవారం విననున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నాజీర్‌లతో కూడిన ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఈ కేసుకు సంబంధించిన వాదనలు విననుంది. అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు.. సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీను నియమించిన సంగతి తెలిసిందే. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, లాయర్ శ్రీరామ్ పంచు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఖలీపుల్లాలను మధ్యవర్తులుగా నియమించింది. ఈ మధ్యవర్తిత్వ కమిటీ సీల్డ్ కవర్‌లో తమ తాత్కాలిక నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. ఈ నెల 6న సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఈ తాత్కాలిక నివేదిక నమోదైంది. నాలుగు రోజుల కిందటే రిపోర్టు వచ్చినా.. ఇతర కేసుల వల్ల సుప్రీంకోర్టు ఇవాళ సమీక్ష జరపాలని నిర్ణయించింది. నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి అనే దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది.


