కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్  

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 50 రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ వ్యవహారం పై ఈరోజు సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త వ్యవసాయ చ‌ట్టాల‌ను సవాల్ చేస్తూ రైతులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీం కోర్టు.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ల‌క్ష్య వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టింది. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేవ‌ర‌కు చ‌ట్టాల‌ను నిలుపుద‌ల చేయాల‌ని ఇప్పటికే సూచించింది. ఒకవేళ కేంద్రం నిలిపివేయకపోతే.. తామే స్టే విధించాల్సి వ‌స్తుంద‌ని తీవ్రంగా హెచ్చ‌రించింది. ఒకపక్క ఆందోళ‌నలలో పాల్గొంటున్న రైతులు చ‌నిపోతుంటే కేంద్రానికి క‌నిపించ‌డం లేదా అని సుప్రీం కోర్టు నిల‌దీసింది. వృద్ధులు, మ‌హిళ‌లు కూడా ఈ ఉద్యమంలో చేరి పోరాటం చేస్తున్నార‌ని గుర్తు చేసింది. ఇప్ప‌టికే ఈ విషయంలో ప‌రిస్థితి విష‌మించింద‌ని.. రేపు ర‌క్త‌పాతం జ‌రిగితే దానికి ఎవ‌రు బాధ్య‌త వహిస్తారని ప్ర‌శ్నించింది. ఇన్ని రోజులు గ‌డిచినా దీనికి ప‌రిష్కారం చూప‌క‌పోవ‌డ‌మేంట‌ని కేంద్రంపై కోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

 

సుప్రీం కోర్టు తాజా వ్యాఖ్య‌ల‌పై అటార్నీ జ‌న‌ర‌ల్ కేకే వెలుగోపాల్ స్పందిస్తూ.. రైతులతో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు గ‌తంలో చ‌ట్టాలు నిలుపుద‌ల చేసిన సంద‌ర్భాలు లేవ‌ని గుర్తు చేశారు. ప్రజల ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లుగుతుంద‌ని భావిస్తే త‌ప్ప స్టే విధించలేరని కోర్టుకు చెప్పారు. ఈ నెల 15న చ‌ర్చ‌లు ఉన్నందున‌.. అప్ప‌టివ‌ర‌కు వేచి చూడాల‌ని అయన కోర్టుకు విజ్ఞ‌ప్తి చేశారు.

 

ఇది ఇలా ఉండగా ఈ నెల 7న కేంద్రం, రైతు సంఘాల మ‌ధ్య జ‌రిగిన ఎనిమిదో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోను మూడు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు త‌మ ఆందోళ‌న కొన‌సాగిస్తామని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తాజా అక్షింతలతో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల కోర్కెలను మన్నిస్తుందా.. లేక కోర్టు ద్వారానే దీనికి పరష్కారం లభిస్తుందా వేచి చూడాలి.