మోదీ సర్కార్ కి షాకిచ్చిన సుప్రీం.. సీబీఐ డైరెక్టర్‌ ఈజ్ బ్యాక్!!

 

మోదీ సర్కార్ కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కేసులో కేంద్రం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఆమధ్య సీబీఐలో డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా మధ్య వివాదాలు చెలరేగి పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగి.. రాకేశ్, ఆలోక్‌లను సెలవుపై పంపి, తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం. నాగేశ్వరరావును నియమించింది. అయితే అప్పుడు కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. మోదీ ప్రభుత్వం సీబీఐ ప్రతిష్టను దిగజార్చేలా చేస్తుంది అంటూ మండిపడ్డాయి. అంతేకాదు తనను సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆలోక్‌ వర్మ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది.

సీబీఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో సీవీసీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు పక్కనబెట్టింది. సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి ఆలోక్‌ వర్మను తప్పించడాన్ని తప్పుబట్టింది. ఆలోక్‌వర్మకు తిరిగి బాధ్యతలను అప్పగించాలని.. నిర్ణయాన్ని సెలక్ట్ ప్యానల్‌కు పంపాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. సీబీఐ కేసు విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మోదీ సర్కార్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. మరి దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.