సుప్రీమ్ శబరిమల తీర్పు… చట్టం ముందు అన్ని మతాలు సమానమేనా?

సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పుల పరంపర కొనసాగుతూనే వుంది. స్వలింగ సంపర్కంపై గొంతు విప్పిన అత్యున్నత న్యాయస్థానం మరో కీలక తీర్పు వెలువరించింది. ఈసారి హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన అంశంలో న్యాయస్థానం సూటిగా అభిప్రాయం వెలువరించింది. శబరిమల ఆలయంలోకి ఆడవారు ప్రవేశించవచ్చని దీపక్ మిశ్రా సహా అందరూ న్యాయమూర్తులు ఏకీభవించారు!

 

 

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలోయంలోకి 10 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు మొదలు 50 ఏళ్ల వరకూ వయస్సున్న వారికి అనుమతి వుండదు. ఇది అందరికీ తెలిసిందే. అయితే, ఈ నియమంపై కోర్టుకెక్కారు కొందరు ఉద్యమకారులు. కేవలం స్త్రీలన్న వివక్షతో, ప్రకృతి సహజమైన ఋతుస్రావం నెపంగా చూపుతూ దేవుడి దర్శనానికి దూరం చేయటం తప్పన్నది వారి వాదన. నిజానికి నెలసరి సమయంలో హిందూ స్త్రీలు ఏ గుడిలోకి కూడా వెళ్లరు. అంతటా ఇది వర్తిస్తుంది. కానీ, అయ్యప్ప ఆలయంలోకి ఎలాంటి శారీరిక ఇబ్బంది లేని రోజుల్లో కూడా ఇంత కాలం అనుమతించే వారు కాదు. పదేళ్ల నుంచీ యాభై ఏళ్ల వయస్సున్న ఆడవారెవరూ కొండ మీదకి వెళ్లేవారు కాదు. ఇది తప్పా ఒప్పా అనేది పెద్ద చర్చ. ఎంతో కాలంగా జరుగుతూ వస్తోంది కూదా. అయితే, తాజా సుప్రీమ్ తీర్పుతో శబరిమల వివాదానికి తెర పడినట్టైంది.

 

 

కోర్టు తీర్పుని అందరూ శిరసావహించటం తప్పనిసరే. అలాగే, అత్యధిక శాతం హిందువులు దీన్ని పెద్దగా విమర్శిస్తారని కూడా భావించలేం. ఎందుకంటే, ఆలయాల్లోకి స్త్రీల్ని నిషేధించటం హిందూ మతంలోని మూలమైన సిద్ధాంతం ఏం కాదు. అసలు అలాంటి నియమం వేదాలు, పురాణాల్లో ఎక్కడా కనిపించదు కూడా. శబరిమల, శని సిగ్నాపూర్ లాంటి క్షేత్రాల్లో కాల క్రమంలో ఏర్పడ్డ నిషేధాలే ఇవన్నీ. కేరళలలోనే ఇతర అయ్యప్ప ఆలయాల్లో కూడా ఎక్కడా స్త్రీల ప్రవేశం కట్టడి చేయలేదు. కేవలం శబరిమల కొండపైకే నిషేధించారు. దాని వల్ల స్త్రీలకి ఏం నష్టం జరుగుతోందని వాదించే చాందసవాదులు కూడా వున్నారు. వారి మాటలో కొంత వరకూ సరైన అంశాలే వున్నా రాజ్యాంగబద్ధంగా పని చేసే కోర్టు మగ, ఆడా మధ్య భేదాలు వుండకూడదన్న సమనత్వ సూత్రంపైనే తీర్పు వెలువరించింది. ఇక ఇక్కడే మరో కోణమూ వుంది. తీర్పు వచ్చింది కాబట్టి నమ్మకాల్ని, విశ్వాసాల్ని పక్కన పెట్టి ఎందరు స్త్రీలు శబరిమల కొండ ఎక్కుతారు? అదీ అనుమానమే! చాలా మంది స్త్రీలు శబరిమల కొండపైకి ఒక వయస్సు వచ్చే వరకూ ప్రవేశం లేకపోవటం పెద్ద సమస్యగా భావించరనేది కూడా సత్యమే!

 

 

ఏ మతమైన ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూనే ముందుకు సాగాలి. అది శబరిమల ఆలయం ప్రవేశమైనా, ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారమైనా… అన్నీ కాలక్రమంలో పక్కకు తప్పుకోవాల్సిందే. కాకపోతే, మన దేశంలో అభ్యుదయవాదులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేయవలసిన పనులు కోర్టులు చేయాల్సి వస్తోంది. అదే విచారకరం! ఇప్పటికైనా కోర్టులో, ప్రభుత్వాల్లో ఏవో ఒకటి అన్ని మతాల్లోని దురాచారాల్ని అంతం చేసే కార్యక్రమం మొదలు పెట్టాలి. అలా కాకుండా కేవలం హిందువుల విశ్వాసాలు, నమ్మకాలు దెబ్బతిసేలా మాత్రమే తీర్పులు, ఆదేశాలు, చట్టాలు వస్తే… అది అశాంతికి కారణం అవుతుంది. మైనార్టీ మతాల విషయంలో కూడా ఉద్యమకారులు, అభ్యుదయవాదులు, ప్రభుత్వాలు నిష్పపక్షపాతంగా, నిర్భయంగా స్పందించాలి. ట్రిపుల్ తలాఖ్ లాంటి దురాచారాల్ని సమూలంగా అంతం చేసే చర్యలు వేగంగా చేపట్టాలి. అదే సమానత్వం అనిపించుకుంటుంది!