వదిలేదేలే!.. రఘురామపై సీఐడీ థర్డ్‌డిగ్రీ.. సీబీఐ దర్యాప్తుపై సుప్రీంకోర్టులో విచారణ..
Published on: Fri Apr 8, 2022 12:46PM
వదల జగన్ నిన్నొదల అంటున్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన వదిలేసినా.. ఈయన మాత్రం వదిలేదేలే అంటూ సుప్రీంకోర్టు కెళ్లారు. తన మానాన తాను మీడియాలో రచ్చబండ చేసుకుంటుంటే.. అరెస్ట్ చేసి, స్టేషన్లో పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటూ ఏపీ సీఐడీపై రఘురామ రగిలిపోతున్నారు. తన తండ్రిని సీఐడీ అధికారులు టార్చర్ చేశారంటూ.. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరపాలంటూ రఘురామ కుమారుడు భరత్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్‌పై తాజాగా సుప్రీంలో విచారణ జరిగింది.
రఘురామ తనయుడు భరత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు నాలుగు వారాల తర్వాత లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని.. సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
రఘురామే కదాని జగన్ సర్కారు లైట్ తీసుకున్నట్టుంది. అరెస్ట్ పేరుతో లోపలేసి చితక్కొట్టారంటూ ఆరోపణ వచ్చింది. సుప్రీంకోర్టుకెళ్లి మరీ బెయిల్ తెచ్చుకుని బయటకొచ్చారు రఘురామ. ఆర్మీ హాస్పిటల్‌లో చికిత్స.. మెడికల్ రిపోర్ట్.. అబ్బో అప్పట్లో రఘురామ ఎపిసోడ్ తీవ్ర సంచలనం సృష్టించింది. రాజు గారి దెబ్బకు జగన్‌రెడ్డికి దిమ్మతిరిగిపోయింది. రఘురామ మామూలోడు కాదని.. ఇక ఆయన జోలికి వెళ్లడం ఆపేసింది. ఇటీవల సంక్రాంతి పండగకి ఈయన నర్సాపురం వస్తానని ఝలక్ ఇవ్వడం.. ఏపీ పోలీసులు అలర్ట్ కావడం.. నోటీసులతో భయపెట్టడం.. ఇలా కొన్ని పరిణామాలు కాస్త ఉత్కంఠ రేపాయి. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలానే ఢిల్లీ నుంచి రచ్చబండతో రచ్చ చేస్తున్నారు రఘురామ. ఆ మధ్యలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసి.. కొన్ని నెలల పాటు తన పార్టీ అధినేతకు చుక్కలు చూపించారు. ఇక ట్విటర్‌లో పదే పదే తనను గిల్లుతున్న విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించి.. ఏ2కి కూడా బాగానే కలవరపెట్టారు. లేటెస్ట్‌గా.. రఘురామ తనయుడు రంగంలోకి దిగి.. ఆనాడు తన తండ్రిపై, కస్టడీలో సీఐడీ అధికారులు చేసిన దాడిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. ఆ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించడం.. సీబీఐ, కేంద్రప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం.. 4 వారాల తర్వాత లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించడం.. వరుస పరిణామాలు చూస్తుంటే జగన్‌రెడ్డిని, ఏపీ సర్కారును అంత ఈజీగా వదిలేరా లేరు రఘురామ. రాజు గారా మజాకా...అంటున్నారు.


