సంక్షోభంలో "సుప్రీం"

 

సుప్రీంకోర్టు.. దశాబ్దాలుగా భారతదేశ న్యాయవ్యవస్థను భుజాలపై మోస్తూ.. సంచలన తీర్పులతో.. ఎందరో దోషులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టి.. ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న సర్వోన్నత న్యాయస్థానం. కింది కోర్టులలో న్యాయం జరగని వారికి మనకు సుప్రీంకోర్టు ఉందన్న భరోసాని అందించింది అంటే సుప్రీంకోర్టు గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప సంస్థ ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. స్వతంత్ర్య భారత చరిత్రలోనే మునుపెన్నడూ జరగని పరిణామం ఇవాళ జరిగింది. న్యాయం చేయాలంటూ సుప్రీం జడ్జీల ముందు మనం నిలబడితే.. మీరే సుప్రీంను కాపాడాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని నడిపిస్తున్న న్యాయమూర్తులు దేశ ప్రజల ముందుకొచ్చారు.

 

ఒకేసారి నలుగురు జడ్జీలు ప్రెస్ మీట్ పెట్టి మరి సుప్రీంలో జరుగుతున్న అవతవకలను జాతికి తెలియజేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా ముందుకు వచ్చి.. "భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది.. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. సుప్రీంలో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు.. గత కొద్ది రోజులుగా అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై మేం నలుగురుం చర్చించి.. పాలనా వ్యవస్థను సరిదిద్దాల్సిందిగా కోరుతూ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం.. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం.. న్యాయమూర్తులుగా ఇలాంటి సమావేశం పెట్టడం బాధాకరమే అయినా.. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యత వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటూ" చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు పంపిన లేఖను మీడియాకు చూపారు.

 

ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చీఫ్ జస్టిస్ వ్యవహార శైలి సవ్యంగా లేదంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ జడ్జిలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించడం.. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అనుమానం సామాన్యులకు కలిగేలా చేసిందని భావిస్తున్నారు. మరోవైపు న్యాయమూర్తుల మీడియా సమావేశం కేంద్రప్రభుత్వ వర్గాల్లో సంచలనం కలిగించింది. వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. కేంద్రప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ సంక్షోభాన్ని చక్కదిద్దకపోతే.. దేశ ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థ సవ్యంగా పరిఢవిల్లేలా చేస్తున్న మూడు స్తంభాల్లో ఒకటిగా.. ప్రపంచం చేత జేజేలు పలికించుకుంటున్న భారత సర్వోన్నత న్యాయస్థానానికి కలంకాన్ని తీసుకువస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.