రాహుల్ గాంధీ కొంపముంచిన సొంత లాయర్

 

న్యాయవాది తన మాటలతో, తెలివితేటలతో.. తన క్లయింట్ ని కేసు నుంచే కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరపు న్యాయవాది మాత్రం.. అనవసరంగా నోరు జారి చిన్న సారీతో పోయేదాన్ని నోటీసుల దాకా తీసుకొచ్చారు.

చౌకీదార్ చోర్ హై అంటూ సుప్రీంకోర్టు తీర్పునకు ఆపాదిస్తూ మోదీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ నేత మీనాక్షి లేఖీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు వివరణ కోరగా.. రాహుల్ ఎన్నికల ప్రచారంలో అనుకోకుండా అన్నానని విచారం వ్యక్తం చేస్తూ అఫిడవిడ్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వాదనలు వినిపించే క్రమంలో రాహుల్ తరపు న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి నోటి నుంచి వచ్చిన ఒక మాట.. రాహుల్ కు సుప్రీం ధిక్కార నోటీసు జారీ చేసేలా చేసింది. అభిషేక్ తన వాదనలు వినిపిస్తూ ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు ఆయన్ను వివరణ అడిగిందే కానీ నోటీసు కాదని.. అందుకు తన క్లయింట్ (రాహుల్) వివరణ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో సుప్రీం బెంచ్ అడ్డు తగిలి.. నాడు మేం నోటీసు ఇవ్వలేదని చెబుతున్నారు. అంటే.. నోటీసు ఇవ్వాలని మీ ఉద్దేశమా?. అయితే ఆ నోటీసు మేం ఇప్పుడు కూడా ఇవ్వొచ్చు.. ఇస్తామంటూ జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అభిషేక్ మాట పూర్తి కాక ముందే ఆర్డర్ కాపీని డిక్టేట్ చేయటం మొదలు పెట్టటంతో అభిషేక్ నోట మాట రాని పరిస్థితి. కొసమెరుపు ఏమిటంటే.. రాహుల్ కు పంపిన ధిక్కార నోటీసులో.. అభిషేక్ సింఘ్వీ వాదనల ఆధారంగానే తామీ ధిక్కార నోటీసు ఇచ్చినట్లుగా పేర్కొనడం. మొత్తానికి సొంత లాయర్ పుణ్యమా అని.. రాహుల్ కు నోటీసు దక్కిన పరిస్థితి.