TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

య‌థా రాజా.. త‌థా మంత్రి.. సీబీఐ కేసుతో ఆది-మూలాలు క‌దిలేనా?

Published on: Sat Oct 9, 2021 11:59AM

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. ఏపీ ముఖ్య‌మంత్రి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడు. 11 సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న నాయ‌కుడు. అలాంటి సీఎం జ‌గ‌న్‌రెడ్డి కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్‌. ముఖ్య‌మంత్రి కాక‌ముందే జ‌గ‌న్‌పై అవినీతి కేసులు ఉన్న‌ట్టు.. మంత్రి కాక‌ముందే సురేశ్‌పై సీబీఐ కేసు న‌మోదైంది. త‌మ పార్టీ అధినాయ‌కుడినే ఆద‌ర్శంగా తీసుకున్నారో, లేక‌, జ‌గ‌నే త‌న అనుభ‌వంతో స‌ల‌హా ఇచ్చారో ఏమో కానీ, ఆ అవినీతి కేసు నుంచి త‌ప్పించుకునేందుకు ఆదిమూల‌పు సురేశ్ గ‌ట్టిగా ప్ర‌య‌త్నించారు. హైకోర్టు స్థాయిలో నెగ్గారు కూడా. కానీ, సీబీఐ మాత్రం జ‌గ‌న్ కేసుల్లో మాదిరి మ‌డ‌మ తిప్ప‌లేదు. సురేశ్‌పై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానంలో మంత్రి సురేశ్‌కు చెక్ ప‌డింది. ఏపీ కేబినెట్ మినిస్ట‌ర్ ఆదిమూల‌పు సురేశ్‌పై ఉన్న‌ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ద‌ర్యాప్తును కొన‌సాగించాల్సిందేన‌ని సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ కేసులున్నాయి. ఈ కేసుల విచార‌ణ‌లు త్వ‌ర‌లోనే మొద‌లుకానున్నాయి. ఇప్ప‌టిదాకా కేసుల విచార‌ణ మొద‌లు కాని నేప‌థ్యంలో..వాటిపై జ‌రుగుత‌న్న అనుబంధ పిటిష‌న్ల విచార‌ణ‌కు జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త హాజ‌రు నుంచి మిన‌హాయింపు పొందుతున్నారు. త్వ‌ర‌లోనే ఆ కేసుల్లో ట్ర‌య‌ల్స్ స్టార్ట్ కానున్నాయి. అప్పుడు కోర్టుకు సీఎం జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త హాజ‌రు త‌ప్ప‌నిస‌రి కావొచ్చు. సరిగ్గా ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న మంత్రివ‌ర్గంలోని మ‌రో మంత్రిపై సైతం సీబీఐ కేసు విచార‌ణ జ‌ర‌గ‌నుండం క‌ల‌క‌లంగా మారింది. ఆదిమూల‌పు సురేశ్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి, ఐఆర్ఎస్ అధికారిణి విజ‌య‌ల‌క్ష్మిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు న‌మోదైంది. సాంకేతిక కార‌ణాల‌తో ఈ కేసుల నుంచి త‌ప్పించుకోవాల‌ని చూడ‌గా.. సుప్రీంకోర్టు తీర్పుతో చెక్ ప‌డింది. 

ఆదిమూల‌పు సురేశ్‌పై ఉన్న సీబీఐ కేసు ఏంటంటే...

సురేశ్‌, ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి ఆ ఇద్ద‌రూ సివిల్ స‌ర్వీసెస్ అధికారులు. విజ‌య‌ల‌క్ష్మి ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీస్ కాగా, గ‌తంలో సురేశ్ ఇండియ‌న్ రైల్వే అకౌంట్స్ స‌ర్వీస్‌లో ప‌నిచేసేశారు. 2009లో జాబ్‌కి రిజైన్ చేసి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు సురేశ్‌. కాంగ్రెస్‌లో చేరి.. వైఎస్సార్‌ను మెప్పించి.. ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ మ‌ర‌ణానంత‌రం జ‌గ‌న్ వెంట న‌డిచారు. 2014, 2019లో వైసీపీ త‌ర‌ఫున గెలిచారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టి.. జ‌గ‌న్ కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. 
 
సురేశ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత.. త‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి అవినీతికి పాల్ప‌డేలా ప్రోత్స‌హించార‌నేది ఆరోప‌ణ‌. 2017లో విజ‌య‌ల‌క్ష్మి ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని.. ఆమె అవినీతికి పాల్ప‌డేలా ప్రోత్సహించారంటూ భ‌ర్త సురేశ్ పైనా కేసు న‌మోదు చేసింది సీబీఐ. అయితే, ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేయ‌క‌ముందే త‌మ‌పై సీబీఐ చార్జిషీట్ దాఖ‌లు చేసింద‌ని, ఈ ప‌ద్ద‌తి చెల్ల‌ద‌ని వాదిస్తూ.. త‌మ‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసును కొట్టివేయాల‌ని తెలంగాణ హైకోర్టులో గ‌తంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సాంకేతిక కార‌ణాల‌తో తెలంగాణ హైకోర్టు సీబీఐ ద‌ర్యాప్తును నిలిపేసింది. దీనిపై సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అవినీతి కేసుల్లో ప్రాథ‌మిక ద‌ర్యాప్తు అనంత‌ర‌మే చార్జిషీట్ దాఖ‌లు చేయాల‌న్న నిబంధ‌న ఏమీ లేద‌ని, మంత్రి సురేశ్ దంప‌తుల‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ద‌ర్యాప్తును కొన‌సాగించ‌వ‌చ్చ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో.. సీఎం జ‌గ‌న్ లాగానే మంత్రి సురేశ్‌కు సైతం సీబీఐ కేసు బిగియ‌నుంది.