భాజపా రథయాత్రకు సుప్రీం అడ్డుకట్ట

 

పశ్చిమ బెంగాల్ లో భాజపా భారీ రథ యాత్ర చేప్పట్టదలిచింది. దీనికి తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మతం, వర్గ పరంగా సున్నితమైన ప్రాంతాల మీదుగా రథ యాత్ర ప్రణాళిక చేయడంతో, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని ప్రభుత్వం చెబుతోంది. రథ యాత్ర చేపడితే ఈ సమస్యలు కచ్చితంగా తలెత్తే అవకాశముందని నిఘా వర్గాలు సైతం చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారం పలు పరిణామాల అనంతరం సుప్రీం కోర్టుకు చేరింది. కాగా విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు భాజపాకి షాక్ ఇచ్చింది.

ఈ యాత్రపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాల దృష్ట్యా ప్రస్తుతానికి యాత్ర చేపట్టొద్దని భాజపాను ఆదేశించింది. అవసరమైతే మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యక్తపర్చిన అభ్యంతరాలకు తగ్గట్లుగా ప్రణాళిక మార్చుకొని యాత్ర జరుపుకొనేందుకు, తిరిగి ప్రభుత్వాన్ని అనుమతి కోరవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పశ్చిమ బంగలో ర్యాలీలు, బహిరంగ సభల్లాంటివి భాజపా ఎక్కడైనా పెట్టుకోవచ్చని సూచించింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ర్యాలీలు, యాత్రలు చేపట్టుకొనే హక్కు తమకు ఉందని భాజపా తరపు న్యాయవాది కోర్టులో వాదించగా.. యాత్ర ప్రణాళిక మార్చుకుంటే అంగీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు సూచించింది.