TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిజాబ్ ఇష్యూ.. ఉపేక్షిస్తే ప్రమాదమే...!!

Published on: Fri Feb 11, 2022 5:00PM

సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు, కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ సమస్య ఇప్పటి కిప్పుడు విచారించి పరిష్కరించవలసిన సమస్య కాదని, సమయం వచ్చినప్పుడు న్యాయ స్థానం జోక్యం చేసుకుంటుందని, ప్రభుత్వాలు, ప్రజలు సున్నిత సమస్యగా, భావిస్తున్న సమస్యను పక్కన పెట్టింది. మరోవంక కర్ణాటక రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వేడిని కొంత చల్లార్చింది. అయితే ఈ సమస్యపై తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ మత పరమైన దుస్తులతో కాలేజీలకు వెళ్లొద్దంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఓ విద్యార్థిని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ధర్మాసనం ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దని సూచించింది.

అయితే, హిజాబ్ సమస్య ఇప్పుడు చాపకింద నీరులా, విస్తరిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హిజాబ్’ కు అటూ ఇటూ రెచ్చగొట్టే విధంగా తీవ్ర వ్యాఖ్యలు,విమర్శలు,విశ్లేషణలు వైరల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా అగ్గి రాజుకునే ప్రమాదం ఉందనిపిస్తోందని అంటున్నారు. 

అదలా ఉంటే,  ఈ సమస్యపై రాజకీయ నాయకులు, స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా దీనిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా మాట్లాడారు. తరగతి గదిలో విద్యార్థునులు హిజాబ్ ధరిస్తే వారికి పాఠాలు అర్థమయ్యేయో..? లేదో..? అనే విషయం టీచర్లకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన హిజాబ్‌పై ఈ విధంగా స్పందించారు. క్లాస్‌లో హిజాబ్ ధరిస్తామని మూడేళ్ల కిందట ఎవరూ అనలేదని కూడా హిమంత బిస్వా అన్నారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ముస్లిం సమాజానికి విద్యే అవసరమని, హిజాబ్‌ కాదని అన్నారు. 

అంతేకాదు "నేను రెండు రకాల ఇస్లాంను అర్థం చేసుకున్నాను. ఒకటి మతపరమైన ఇస్లాం, మరొకటి రాజకీయ ఇస్లాం. మతపరమైన ఇస్లాంలో ఖురాన్ ప్రకారం మంచి విషయాలు రాశారు. ఇక రెండో రకమైన ఇస్లాంను కాంగ్రెస్ స్పాన్సర్ చేసింది. ఏ రాజకీయాలు జరుగుతున్నాయో చూడండి, కోర్టులో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తున్న లాయర్లందరూ కాంగ్రెస్‌కు చెందిన వారే. ఇదంతా కాంగ్రెస్‌ పార్టీనే చేస్తుంది." అని హిమంత బిస్వా ఆరోపించారు. నిజానికి, హిజాబ్ సమస్య.. వంటి సున్నిత సమస్యలను మొగ్గలలోనే తుంచేయాలని లేదంటే సమస్య జటిలమై సవాలుగా మారుతుందని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.