క్రికెటర్ శ్రీశాంత్‌కు సుప్రీంలో ఊరట.. క్రికెట్‌ ఆడేందుకు సిద్ధం

 

టీం ఇండియా క్రికెటర్ శ్రీశాంత్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్పాట్ ఫిక్సింగ్ నేరానికి పాల్పడినందుకుగాను.. బీసీసీఐ అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం తీర్పు వెలువరించింది. శ్రీశాంత్‌పై విధించిన శాశ్వత బహిష్కరణను బీసీసీఐ పునఃసమీక్షించాలని పేర్కొంది. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం బీసీసీఐ క్రమశిక్షణ కమిటీని ఆదేశించింది.

శ్రీశాంత్‌ తరపు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షిద్‌ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ‘ఖచ్చితమైన ఆధారాలు లేకుండా బీసీసీఐ.. శ్రీశాంత్‌పై నిషేధం విధించడం దారుణమన్నారు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని.. ఒక ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఓవర్‌లో శ్రీశాంత్‌ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అసలు శ్రీశాంత్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు కూడా లేవు. కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించడం సరికాదు’ అని ఆయన కోర్టుకు విన్నవించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీసీసీఐ శ్రీశాంత్‌ను జీవితకాలం నిషేధించడం సరికాదని ఖుర్షీద్‌ వివరించారు. 2018 ఆగస్టులో కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చిందని అయినా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఖుర్షీద్‌ తెలిపారు. అనంతరం శ్రీశాంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను 30 ఏళ్ల వయసులో ఇంకా ఫిట్‌నెస్‌గా ఉన్నానని, బీసీసీఐపై తనకు నమ్మకముందని చెప్పాడు. బీసీసీఐ అధికారులు తనపై నిషేధాన్ని ఎత్తివేస్తే మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.