ఆటో మేజర్లకు సుప్రీంకోర్టు షాక్..

 

సుప్రీంకోర్టు ఆటో మేజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. బీఎస్‌-3 వాహనాలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్టాక్‌ మార్కెట్లో ఆటో కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య  ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే  ఎక్కువ ముఖ్యమని  సుప్రీం తేల్చి చెప్పింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయని తీర్పు చెప్పింది.  ఏప్రిల్‌ తరువాత బీఎస్‌-3  వాహనాల రిజిస్ట్రేషన్లను, అమ్మకాలను నిలిపి వేయాలని పేర్కొంది. దీంతో రూ.12వేల కోట్ల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఒక్కసారిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.2 లక్షల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఉందని సియామ్ డేటాలో తేలింది. వాహనాల కేటగిరీ ప్రకారం దీనిలో బీఎస్-3 కమర్షియల్ వెహికిల్స్ 96వేలు, టూ-వీలర్స్ 6 లక్షలు, త్రీ-వీలర్స్ 40వేలు ఉన్నాయి. తాజా సుప్రీం ఆదేశాలకు ఇవన్నీ  ప్రభావితం కానున్నాయి.