రాష్ట్ర విభజనపై స్టే‌ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

 

 

 

రాష్ట్ర విభజన విషయంలో సుప్రీంకోర్టు మీద ఆశలు పెట్టుకున్న సీమాంధ్రులకు తీవ్ర నిరాశ కలిగింది. రాష్ట్ర విభజన మీద సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల మీద సుప్రీం కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర విభజన మీద సుప్రీం కోర్టు స్టే విధించే అవకాశం వుందన్న ఊహాగానాలకు సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర విభజన మీద ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన కేసులను ఆగస్టు 20వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జూన్ 2న వున్న అపాయింటెడ్ డేని రద్దు చేయాలని పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన రాజ్యాంగ బద్ధంగా జరగలేదని, సీమాంధ్ర ఎంపీలను గెంటివేసి, పార్లమెంట్ తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు ఆపేసి రాష్ట్రాన్ని విభజించారని అంటూ ఈ కేసును వాదిస్తున్న లాయర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు పట్టించుకోలేదు.