సుప్రీమ్ కోర్ట్ లో న్యాయవ్యవస్థకే తలవంపు..

 

మునుపెన్నడు లేని విధంగా సుప్రీం కోర్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొదటిసారి  ‘అధికార పరిధి వివాదం’ రాజుకుంది. దీనికి కారణం మెడికల్ సీట్ల కుంభకోణమే. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవుకు చెందిన ప్రసాద్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు చెందిన మెడికల్‌ కాలేజీతో పాటు 46 వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్ల కుంభకోణం జరిగిన సంగతి తెలిసిందే. కళాశాలల్లో తగిన వసతులు లేవంటూ భారతీయ వైద్య సంస్థ (ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే ఈ కుంభకోణంలో కొందరు న్యాయమూర్తుల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. ఒడిషా హైకోర్టులో జడ్జిగా పనిచేసిన ఇష్రత్‌ మస్రూర్‌ ఖడూసీ ని , మరో ఐదుగురిని సెప్టెంబర్‌ 20 న అరెస్ట్‌ చేయడంతో వ్యవహారం ఒక్కసారిగా వెలుగు చూసింది. అయితే ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో విచారణ జరిపించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ విచారణలో భాగంగా...జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. ఆ తరువాత న్యాయవాదులు దుశ్యంత్‌ దవే, ప్రశాంత్‌ భూషణ్‌లు జస్టిస్‌ చలమేశ్వర్‌ ముందు మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో... ఆయన పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ, దీనిని సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్‌ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే వారిలో చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పేరును తీసేశారు. ఇక దీనిపై స్పందించిన మిశ్రా ఈ కేసును తేల్చే పనిని మరో ధర్మాసనానికి అప్పగించాలని చలమేశ్వర్ కు ఆదేశాలు ముసాయిదా పంపారు. అయితే... జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాత్రం తాను అనుకున్నట్లుగానే ఆదేశాలు జారీ చేశారు.

 

దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, ఆయన తర్వాత అత్యంత సీనియర్‌ జడ్జి అయిన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మధ్య వివాదం రాజుకుంది.  చీఫ్‌ జస్టిస్‌ అయిన తనను పక్కనపెడుతూ ఐదుగురు అత్యంత సీనియర్లతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఆదేశాలను జస్టిస్‌ దీపక్‌ మిశ్రా కొట్టివేశారు. ఇప్పుడు దీనికి తోడు...‘‘ఈ కేసులో మీ పేరూ ఉంది...దీనిపై మీరు ఎలా విచారణ జరుపుతారు’’ అంటూ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బహిరంగ కోర్టులోనే జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను నిలదీయడంతో మరో సంచలనం చోటుచేసుకుంది.

 

ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, సీనియర్‌ లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఒక దశలో ప్రశాంత్‌ భూషణ్‌ తన స్వరం పెంచారు. ‘‘సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మీ పేరు కూడా ఉంది. ఈ కేసు విచారణ నుంచి మీరు తప్పుకోవాల్సిందే’’ అని వాదించారు. దీనిపై జస్టిస్‌ మిశ్రా మండిపడ్డారు. ‘ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో చెప్పండి. అంతా నాన్సెన్స్‌. అందులో నా పేరు సూచిస్తూ ఒక్కపదం కూడా లేదు. ముందు మా ఆదేశాలు చదవండి. మీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవచ్చు. మీరు నాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. ఆ విషయం మీకూ తెలుసు...మీరు సహనం కోల్పోయినా... మేం కోల్పోం’’ అంటూ తీవ్రంగా స్పందించారు. అయినా... ప్రశాంత్‌ భూషణ్‌ వెనక్కి తగ్గలేదు. ‘‘సరే! నాకు కోర్టు ధిక్కార నోటీసు ఇవ్వండి. విచారణ జరపాల్సిన పద్ధతి ఇది కాదు. కోర్టులో అందరూ మాట్లాడుతున్నారు. అందరినీ మాట్లాడనిస్తున్నారు. నన్ను మాత్రం మాట్లాడనివ్వడంలేదు’’ అంటూ విచారణ మధ్యలోనే కోర్టు హాలు నుంచి విసురుగా వెళ్లిపోయారు. మొత్తానికి సుప్రీంకోర్టులో మునుపెన్నడూ లేని విధంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. మరి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళుతుందో చూద్దాం..