సర్దార్జీ జోకులని ఎలా ఆపగలం- సుప్రీంకోర్టు!
Published on: Wed Feb 17, 2016 10:54AM
.jpg)
సర్దార్జీల గురించి మనకు తెలియదు. మనలో చాలామందికి సిక్కులతో పరిచయమూ లేదు. కానీ సర్దార్జీల మీద వచ్చే జోకులని మాత్రం బాగా ఆస్వాదిస్తాం. పదేపదే చదువుకుని పడీపడీ నవ్వుకుంటాం. దేశమంతా ఇలా తాము నవ్వులపాలు కావడం చూసి సర్దార్జీలకి ఒళ్లు మండింది. తమని లక్ష్యంగా పెట్టుకుని వస్తున్న ఇలాంటి జోకులకు అడ్డుకట్ట వేయాలంటూ సుప్రీంకోర్టుని హర్వీందర్ చౌదురి అనే న్యాయవాది కేసుని దాఖలు చేశారు. సర్దార్జీలను అమయకులుగా, అసమర్ధులుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఇలాంటి జోకుల వల్ల... తమ పిల్లలు సిక్కులమని చెప్పుకోవడానికి కూడా అవమానపడుతున్నారన్నది చౌదురి వాదన.మొదట్లో ఈ కేసుని సుప్రీంకోర్టు తేలికగానే తీసుకుంది.
కానీ దిల్లీ సిక్కు గురుద్వారా కూడా ఈ కేసుకి తన మద్దతు తెలుపడంతో కేసుని విచారించక తప్పలేదు. కానీ ఈ విషయంలో న్యాయపరంగా తాము తీసుకోదగ్గ చర్యలు పెద్దగా ఏమీ ఉండబోవంటూ న్యాయస్థానం పెదవి విరిచింది. ‘సిక్కులంటే మాకు అపారమైన గౌరవం ఉంది. సిక్కులలో ఎందరో పెద్దలు మన దేశానికి వన్నె తెచ్చారు. కానీ ఇలాంటి జోకులను చట్టపరంగా ఎలా అడ్డుకోగలం. పైగా మీ వర్గానికి చెందిన కుష్వంత్ సింగ్ వంటి రచయితలే వీటికి ప్రచారాన్ని కల్పించారు.’ అంటూ సుప్రీం తన నిస్సహాయతను వెల్లడి చేసింది. కావాలంటే మీరే కొన్ని చర్యలను సూచించంది అంటూ ప్రతివాదులకు ఆరు వారాల గడువుని ఇచ్చింది.


