TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మొక్కజొన్న రైతును ఆదుకోండి.. కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ

Published on: Tue Apr 28, 2026 9:25AM

ఏపీలో  మొక్కజొన్న సాగు చేస్తున్న రైతాంగం ఎదుర్కొంటున్న   ఆర్థిక ఇబ్బందులపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు కనీస మద్దతు ధర కంటే దారుణంగా పడిపోవడంతో అన్నదాతలు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చంద్రబాబు లేఖ రాశారు.  

రాష్ట్రంలోని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను వివరిస్తూ..  క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య మాత్రమే పలుకుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రూ.2,400 తో పోలిస్తే ఇది  చాలా తక్కువ అని పేర్కొన్న ఆయన  ఈ వ్యత్యాసం వల్ల సాగుదారులు పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రబీ సీజన్ దిగుబడులు మార్కెట్‌కు వస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తోందని పేర్కొన్నారు.

ఈ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు  ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (పీఎంఆశా) కింద  ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తక్షణమే అమలు చేయాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని ఆ లేఖలో కోరారు. ఈ పథకానికి అయ్యే మొత్తం 100 శాతం ఆర్థిక భారాన్ని ఒక ప్రత్యేక సందర్భం కింద కేంద్ర ప్రభుత్వమే భరించాలని   విజ్ఞప్తి చేశారు. అప్పుడే రైతులకు కనీస మద్దతు ధర దక్కే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా నేరుగా సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలనీ,  ప్రస్తుతం ఉన్న సేకరణ గడువును జూన్ 2026 వరకు పొడిగించడం ద్వారా చివరి గింజ వరకు రైతు నుంచి సేకరించే అవకాశం ఉంటుందని చంద్రబాబు ఆ లేఖలో కోరారు.