TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ బాలుడి నిజాయితీకి సూపర్ స్టార్ ఫిదా!

Published on: Sun Jun 1, 2025 8:16AM

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా ఆ బాలుడు చిన్నతనంలోనే తన నిజాయితీతో ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన ఆత్మవిశ్వాసం, తనది కాని సొమ్ము వద్దంటూ కరాఖండీగా చెప్పిన తీరు సూపర్ స్టార్ రజనీని సైతం ముగ్ధుడిని చేశాయి. ఔను.. ఆ ఏడేళ్ల బాలుడి నిజాయితీకి, ఆత్మ విశ్వాసానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ఫిదా అయ్యారు. తనది కాని సొమ్ము తనకు వద్దని నిష్కర్షగా చెప్పడమే కాదు.. అంతకంతా తాను సంపాదించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తమిళనాడుకు చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెడితే.. 

మహ్మద్ యాసిన్ తనకు రోడ్డుపై దొరికిన 50 వేల రూపాయలను తీసుకుని తిన్నగా పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసు అధికారికి ఆ సొమ్ము ఇచ్చి ఎవరో పారేసుకున్నారు. జాగ్రత్తగా వారికి అందజేయండి అని రిక్వెస్ట్ చేశాడు. సహజంగానే ఆ పోలీసు అధికారి బాలుడి నిజాయితీకి ముచ్చటపడ్డాడు. ఇంత డబ్బు నీకు దొరికింది.. నువ్వే ఉంచేసుకోవచ్చుకదా.. అన్న ఆ పోలీసు అధికారికి ఆ ఏడేళ్ల బాలుడు ఇచ్చిన సమాధానంతో నోట మాటరాలేదు. ఆ బాలుడేమన్నాడంటే.. అది ఎవరో కష్టపడి సంపాదించిన సొమ్ము.. అది నాది కాదు..నాది కాని డబ్బును నేనెలా తీసుకుంటాను అంటూ అమాయకంగానే అయినా చాలా ధృఢంగా చెప్పాడు. దీంతో ఆ బాలుడి నిజాయితీకి ముగ్ధుడైన పోలీసు అధికారి..  నీ కోసం నేనేదైనా చేయాలని ఉంది.. ఏం చేయమంటావు అని అడిగితే.. మహ్మద్ యాసిన్ జవాబు ఏమిటో తెలుసా.. సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూడాలని ఉందని.

విషయాన్నిపోలీసులు రజనీకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు.వెంటనే స్పందించి రజనీ కాంత్ మహ్మద్ యాసిన్ ను తన వద్దకు పిలిపించుకున్నారు. దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ఆ పిల్లవాడి చదువు బాధ్యత తీసుకున్నారు. ఆ కుర్రవాడు ఎక్కడ చదువుకోవాలనుకుంటే అక్కడ, ఎం చదువుకుంటానంటే అది.. ఎంత ఖర్చైనా ఆ బాధ్యతంతా తనదేనని చెప్పారు. నిజాయితీకి కులం, మతం ఉండవనీ, అది పుట్టుకతో అబ్బే సుగుణమని అన్న రజనీకాంత్ అలాంటి సుగుణాల పుట్ట అయిన మహ్మద్ యాసిన్ అందరికీ ఆదర్శం అని మెచ్చుకున్నారు.