TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రానురాను అంటూనే రజనీ వచ్చేస్తున్నాడా?

Published on: Wed May 17, 2017 11:16AM

ఆ దేవుడు ఆదేశిస్తాడు...ఈ అరుణాచలం పాటిస్తాడు... ఇరవై ఏళ్ల క్రితం రజనీకాంత్‌ చెప్పిన ఈ డైలాగ్‌ తమిళనాట ఓ ఊపు ఊపింది. ఇప్పుడు అదే స్టైల్లో... నా భవిష్యత్తును ఆ దేవుడే నిర్ణయిస్తాడంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చెబుతున్న రియల్ డైలాగ్‌ తమిళనాట ప్రకంపనలు పుట్టిస్తోంది. కొద్దిరోజులుగా అభిమానులతో సమావేశమవుతోన్న రజనీకాంత్‌... త‌న‌కు రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేందటూనే... దేవుడు ఆదేశిస్తే మాత్రం కచ్చితంగా రాజకీయాల్లో వస్తానంటూ తేల్చేశారు. దేవుడు ప్రస్తుతానికి తనను న‌టుడిగా చూడాలనుకుంటున్నాడనీ...అది నెరవేరుస్తున్నాననీ,  ఒక‌వేళ దేవుడు నిర్ణయిస్తే మాత్రం రాజ‌కీయాల్లోకి కచ్చితంగా వ‌స్తానన్నారు.

 

21 ఏళ్ల క్రితం తాను ఓ రాజకీయ కూటమికి మద్దతిచ్చి తప్పుచేశానన్నారు రజనీకాంత్. దాన్ని ఓ పొలిటికల్ యాక్సిడెంట్‌ గా అభివర్ణించారు. అప్పటి నుంచి చాలా మంది నేత‌లు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఇక శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంపైనా రజనీ వివరణ ఇచ్చారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. 

 

అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనన్నారు రజనీ, రాజకీయాల్లోకి వచ్చేది...లేనిది కచ్చితంగా తేల్చనప్పటికీ... రావాలని నిర్ణయిస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. ఒకవేళ పొలిటికల్‌ ఎంట్రీ జరిగితే తప్పుడు వ్యక్తులను దగ్గరకి చేరనివ్వనని... నిజాయ‌తీగా ప‌నిచేస్తాన‌ని రజనీ చెప్పుకొచ్చారు. అయితే దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానన్న రజనీ వ్యాఖ్యలు... పెద్ద పొలిటికల్‌ జోక్‌ అంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సెటైర్లేశారు. రజనీకి అంత సీన్‌ లేదని, ఎక్కువగా ఊహించుకోవద్దని అప్పుడే అటాక్‌ మొదలుపెట్టారు.