TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా కూటమి కెప్టెన్ ఎవరు?

Published on: Thu Jul 27, 2023 1:50PM

ఈ నెల 18న బెంగుళూరులో ఏర్పాటైన ఇండియా కూటమికి సారథ్యం వహించే నేత ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాబట్టి యుపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ  పేరు వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 2004 నుంచి యుపీఏ చైర్ పర్సన్ గా ఉంటున్న సోనియాగాంధీ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. గత పది  రోజుల నుంచి ఇండియా కూటమికి నేత ఎవరు అనే చర్చ కొనసాగుతోంది. యుపీఏ చైర్ పర్సన్ గా ఆమె సమర్ధవంతంగా పని చేశారు.2ేే004 నుంచి 2014 వరకు బలమైన ఎన్డిఏ  కూటమిని మట్టి కరిపించి రెండు పర్యాయాలు అధికారంలో తీసుకురావడంలో సోనియా గాంధీ ముఖ్య భూమిక  వహించిన సంగతి తెలిసిందే.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా 26 ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. 'ఇండియా' పేరుతో ఏర్పడిన ఈ కూటమికి నాయకత్వం వహించేది ఎవరని రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెండు మార్లు సమావేశం అయినప్పటికీ కూటమికి నాయకుడిని ఎన్నుకోవడంపై ప్రతిపక్షాలు ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం ఈ విషయంపైనే బీజేపీ సహా ఎన్డీయే కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాల కూటమిని ముందుండి నడిపించే నాయకుడే లేడని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఇండియా కూటమికి నాయకుడు ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే స్పందించారు.
ఇండియా కూటమికి నాయకుడంటూ ఎవరూ లేరని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అయితే, ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించేందుకు తామంతా కూటమిగా ఏర్పడ్డామని, కూటమిలోని పార్టీల ఉమ్మడి లక్ష్యం అదేనని వివరించారు. కూటమికి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం అంతగా లేదని చెప్పారు. జనాలకు పెద్దగా తెలియని వ్యక్తులు కూడా అవకాశం రాగానే తమలోని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి అందరి మెప్పును పొందారని చెప్పారు. చరిత్రలో ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయని ఉద్ధవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు ఇందుకు చక్కని ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ హఠాన్మరణం తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారని ఉద్ధవ్ గుర్తుచేశారు.