TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పయ్యావులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే.. హైకోర్టు స్పష్టీకరణ

Published on: Wed Feb 22, 2023 4:13PM

తెలుగుదేశం నాయకులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహించేది లే.. అన్నట్లుగా జగన్ సర్కార్ తీరు ఉందనడానికి  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత తొలగింపు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పయ్యావుల కేశవ్ కు ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను జగన్ సర్కార్ గత ఏడాది జులై నెలలొ ఉపసంహరించింది. ఆయనకు కేటాయించిన గన్ మెన్ లను వెనక్కు పిలిపించింది.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే పయ్యావుల సెక్యూరిటీని తొలగించిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవంగా తనకు భద్రత పెంచాలని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచకపోగా... ఉన్న సెక్యూరిటీని తొలగించింది. 
 నిబంధనల మేరకు ప్రతి మూడేళ్ల కోసారి ప్రజాప్రతినిథుల వ్యక్తిగత భద్రతా సిబ్బందిని బదలీ చేయడం సహజమని, అందులో భాగంగానే పయ్యావుల భద్రతా సిబ్బంది బదలీ జరిగిందనీ వివరించింది. త్వరలోనే ఆయనకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది.

 సరే పయ్యావులకు ఇప్పటి వరకూ భద్రత కల్పించలేదు. దీనిపై  పయ్యవుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు  ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.  

ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటీషనర్ కు సూచించింది. వారిలో   ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేంలా ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది.  

గతంలో విచారణకు వచ్చిన సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా, ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటీషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల   ప్రభుత్వ న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది. పిటీషనర్ కు నమ్మకం ఉండాలి కదా అని వ్యాఖ్యానించిన హైకోర్టు తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడం పై తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.