వడదెబ్బ తగిలిన వెంటనే...


గ్లోబల్ వార్మింగో మరొకటో.... కారణం ఏదైతేనేం! ఒకో ఏడాది గడిచేకొద్దీ ఎండల తీవ్రత పెరిగిపోతూనే వస్తోంది. ఆ ఎండల బారిన పడి వడదెబ్బతో విలవిల్లాడిపోయేవారి సంఖ్యా పెరిగిపోతోంది. కానీ కాస్తంత అవగాహన ఉంటే వడదెబ్బని తప్పించుకోవడం ఏమంత కష్టం కాదంటున్నారు.

 

వడదబ్బ కలిగే పరిస్థితిని Hyperthermia అంటారు. మన శరీరం నుంచి వెళ్లిపోయే వేడికన్నా, శరీరం లోపల ఉన్న వేడి ఎక్కువైనప్పుడు ఈ పరిస్థితి ఏర్పుడుతుంది. దాంతో శరీరంలో వేడిని నియంత్రించే thermo regulation అనే వ్యవస్థ దెబ్బతినిపోయి వడదెబ్బకి దారితీస్తుంది. సాధారణంగా 40.6 డిగ్రీలని మించి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వడదెబ్బ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

 

విపరీతమైన ఉష్ణోగ్రతలకి తోడు మరికొన్ని పరిస్థితులు కూడా వడదెబ్బకి కారణం కావచ్చు. మందపాటి దుస్తులు వేసుకోవడం, ఎండలో విపరీతంగా శ్రమించడం, నేరుగా ఎండ తీక్షణత ఒంటికి తగిలేలా తిరగడం వంటి చర్యలతో ఏరికోరి వడదెబ్బని తెచ్చుకున్నట్లవుతుంది. ఇక మద్యపానం, కాఫీటీలు తాగడం వల్ల కూడా వాటిలోని రసాయనాలకి ఒంట్లో డీహైడ్రేషన్ ఏర్పడి వడదెబ్బకి దారితీయవచ్చు.

 

ముందు జాగ్రత్త

 

వడదెబ్బ వచ్చాక బాధపడేకంటే రాకుండా చూసుకోవడం తేలిక. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది.

- ఎండాకాలం వదులుగా, లేత రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోవాలి.

- బయటకి వెళ్లాల్సి వస్తే వెడల్పాటి అంచులు ఉన్న టోపీ పెట్టుకోవడం చాలా ఉపయోగం.

- మూసి ఉన్న కారులో ఉష్ణోగ్రతలు చాలా త్వరగా పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని కారులో వదిలి వెళ్లకూడదు. ఎండలో ఉంచిన కారులో వేడి కాస్త తగ్గేదాకా తలుపులు తీసి ఉంచాలి.

- పిల్లలు, వృద్ధులలో వేడిని నియంత్రించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

- కుక్కలు, పిల్లులకి చెమటే పట్టదు. ఇవి త్వరగా వడదెబ్బకి గురవుతాయి. కాబట్టి వీటిని వదలి బయటకు వెళ్లేటప్పుడు, వాటికి అందుబాటులో తగినంత మంచినీరు ఉందో లేదో గమనించుకోవాలి.

- మంచినీళ్లు తాగుతూ ఉండాలి. మూత్రం పచ్చగా ఉంటే మనం తగినంత నీరు తాగడం లేదని గ్రహించాలి.

 

వడదెబ్బ తగిలితే! కళ్లు తిరగడం, అయోమయంగా ప్రవర్తించడం, నిస్సత్తువగా మారిపోవడం, తలనొప్పి, చెమట పట్టకపోవడం, వాంతులు, గుండెదడ... లాంటి లక్షణాలన్నీ వడదెబ్బ సమయంలో చూడవచ్చు. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఫిట్స్ రావడం, మూర్ఛపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇవి మరణానికే దారితీయవచ్చు. అందుకని వడదెబ్బ తగిలిందన్న అనుమానం రాగానే ఈ చర్యలు తీసుకుంటే రోగి కోలుకునే అవకాశం ఉంటుంది.

 

- రోగి ఒంటి మీద ఉన్న దుస్తులు వదులుచేసి బాగా గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి.

- మెడ, గజ్జలు, తల దగ్గర నీటిలో తడిపిన గుడ్డలని ఉంచాలి. దాంతో ఉష్ణోగ్రతలు వెంటనే అదుపులోకి వస్తాయి.

- చల్లటి నీరు నింపిన టబ్బులో రోగిని ముంచితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

- ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీటిని ఒక్కసారిగా కాకుండా నిదానంగా తాగించాలి.

 

ఒక పక్క ప్రాథమిక చికిత్స చేస్తూనే దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవసరాన్ని బట్టి రోగికి ఇంట్రావీనస్ ద్వారా శరీరంలో కోల్పోయిన లవణాలను వెంటనే అందించే ప్రయత్నం చేస్తారు.

- నిర్జర.