TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉప్పల్‌లో సన్ రైజర్స్‌ ఆల్ రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ఘన విజయం!

Published on: Sun Apr 19, 2026 6:36AM

హైదరాబాద్‌ వేదికగా శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఐపీఎల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు.  

తొలుత  బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోరు సాధించింది.  ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59) ఆరంభం నుండే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 5.5 ఓవర్లలోనే ట్రావిస్ హెడ్‌తో కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59) తన క్లాస్ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జామీ ఓవర్టన్ చెరో మూడు వికెట్లు తీసి హైదరాబాద్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.

195 పరుగుల   లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం దీటుగా పోరాడింది. ఆయుష్ మాత్రే 30, మాథ్యూ షార్ట్ 34 పరుగులూ చేశారు. ఇద్దరూ కూడా వేగంగా ఆడటంతో   ఒక దశలో చెన్నై విజయం నల్లేరుపై బండినడకే అనిపించింది.  అయితే హైదరాబాద్ బౌలర్ ఎషాన్ మలింగ (3/29) కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మలింగ కేవలం 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది.

చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమైన తరుణంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని గత మ్యాచ్ హీరో ప్రఫుల్ హింగేకు అప్పగించాడు. అప్పటికే ఎక్కువ పరుగులు ఇచ్చిన హింగేపై   ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌల్ చేశాడు.  జామీ ఓవర్టన్ ను ఔట్ చేశాడు. 

చివరికి చెన్నై   20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో  సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంది. ఈ విజయంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల సమష్టి కృషి ఉంది. ఇంత వరకూ హైదరాబాద్ బ్యాటింగ్ లో సూపర్బ్.. కానీ బౌలింగే బలహీనం అన్న ఫీలింగ్ ఉండేది. కానీ గత రెండు మ్యాచ్ ల నుంచి హైదరాబాద్ బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు.   దీంతో  రైజర్స్   అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.