TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సన్ రైజర్స్ ఎలిమినేటెడ్

Published on: Thu May 28, 2026 9:06AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం  ముగిసింది. చండీగఢ్‌ వేదికగా జరిగిన అత్యంత కీలకమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో ఆశలతో మైదానంలోకి అడుగుపెట్టిన ఆరెంజ్ ఆర్మీని ఈ ఓటమి కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ కెప్టెన్ నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది.  రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్ బౌలింగ్‌ను తుత్తునియాలు  చేస్తూ కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 97 పరుగులు సాధించి   విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును కేవలం మూడు పరుగుల తేడాతో తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అతని ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 125 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ సైతం  ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 21 బంతుల్లోనే మెరుపు అర్ధశతకం చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల  భారీ స్కోరును నమోదు చేసింది. హైదరాబాద్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా పరుగుల వరదను అడ్డుకోలేకపోయారు.

244 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. రాజస్థాన్ రాయల్స్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ పవర్‌ప్లేలోనే  సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. హైదరాబాద్ ఆశలు పెట్టుకున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ అయ్యాడు.  మరో విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ కేవలం 17 పరుగులకే వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్ 33 పరుగులు చేసి కాస్త ఆశలు రేపినా ఆర్చర్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. దీంతో హైదరాబాద్ జట్టు పవర్‌ప్లే ముగిసేసరికే పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

మిడిల్ ఆర్డర్‌లో జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా   18 పరుగులకే అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఆఖర్లో యువ ఆటగాళ్లు నితీశ్ రెడ్డి 38 పరుగులు, సలీల్ అరోరా 35 పరుగులతో కాసేపు ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.  హైదరాబాద్  19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ 47 పరుగుల భారీ విజయంతో రాజస్థాన్ రాయల్స్  క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది.  శుక్రవారం (మే 29) జరిగే క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్త్ కోసం తలపడనుంది.